USA: అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆరోగ్యంపై వైద్యుల కీలక ప్రకటన
- 3 గంటల పాటు పరీక్షలు నిర్వహించిన వైద్యులు
- 80 ఏళ్ల వయసులో ఆయన ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడి
- గత సంవత్సరం కరోనాతో ఇబ్బంది పడ్డ బైడెన్
అమెరికా అధ్యక్షుడు 80 ఏళ్ల జో బైడెన్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, విధి నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది లేదని శ్వేతసౌథం ప్రకటించింది. గత సంవత్సరం కరోనా వైరస్‌తో ఇబ్బందులు ఎదుర్కొన్న బైడెన్ ఛాతీ నుంచి చిన్న కణతిని తొలగించినట్టు వైద్యులు తెలిపారు. దాంతో, దీర్ఘకాల కోవిడ్ లక్షణాల నుంచి ఆయన విముక్తి పొందారన్నారు. శారీరక పరీక్ష తర్వాత వైద్యులు ఆరోగ్యంగా ఉన్నారని, విధి నిర్వహణకు ఫిట్ గా ఉన్నారని తెలిపారు. ‘మా అధ్యక్షుడు ఫిట్ గా ఉన్నారు. ఎటువంటి మినహాయింపులు లేకుండా తన బాధ్యతలన్నింటినీ పూర్తిగా నిర్వర్తిస్తారు’ అని వైట్ హౌస్ వైద్యుడు కెవిన్ ఓ కానర్ బైడెన్ ఆరోగ్య పరీక్ష రిపోర్టులో స్పష్టం చేశారు.
మేరీల్యాండ్‌లోని వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్‌లోని వైద్యులు బైడెన్ కు మూడు గంటలపాటు వివిధ పరీక్షలు నిర్వహించారు. బైడెన్ 2024లో రెండోసారి అధ్యక్ష పదవికి సిద్ధమవుతున్నందున ఆయన ఆరోగ్య పరీక్షలపై ఆసక్తి నెలకొంది. బైడెన్ కు కోవిడ్ దీర్ఘకాలిక లక్షణాలు లేవని తేలింది. ఇక తన ఆరోగ్యం బాగానే ఉందని, పరీక్షలు సాఫీగా సాగాయని బైడెన్ పేర్కొన్నారు.
కాగా, అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన అతి పెద్ద వయస్కుడైన బైడెన్ తనకు వయోభార సమస్యలు లేవన్నారు. అయితే, 2024లో మరోసారి గెలిస్తే మరో నాలుగు సంవత్సరాలు దేశానికి సేవ చేయగలిగే శారీరక సామర్థ్యం బైడెన్ కు ఉందా? అనే అంశంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారని పలు పోల్స్ తెలిపాయి.