Laser Treament: లేజర్ చికిత్స.. గుండె రక్తనాళాల్లో కొవ్వు క్షణాల్లో మటుమాయం
- గుండె రక్తనాళాల్లో క్లాట్స్ తొలగింపునకు కొత్త లేజర్ చికిత్స
- నాగ్‌పూర్ లైవ్ కాన్క్లేవ్ సమావేశంలో చికిత్సను పరిచయం చేసిన వైద్యులు
- లేజర్‌తో క్లాట్స్ క్షణాల్లో మటుమాయం
గుండె రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును(ప్లాక్స్) తొలగించే మరో గొప్ప వైద్య ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. నాగ్‌పూర్‌లో జరుగుతున్న లైవ్ కాన్క్లేవ్లో మెదాంతా హాస్పిటల్‌కు చెందిన డా. ప్రవీణ్ చంద్రా ఈ చికిత్సను పరిచయం చేశారు. తీక్షణమైన లేజర్ కిరణాలతో రక్తనాళాల్లోని కొవ్వు ప్లాక్స్ ఆవిరైపోతాయని చెప్పారు. సాధారణ శస్త్రచికిత్సలతో పోలిస్తే ఇది ఎంతో సులువైనదిగా పేర్కొన్నారు.
రక్తనాళం గుండా క్యాథెటర్ పంపించి లేజర్‌తో అడ్డంకులు తొలగిస్తామని తెలిపారు. ఈ టెక్నాలజీతో ఇప్పటివరకూ తమ ఆసుపత్రిలో 55 శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించామన్నారు. అధికశాతం సందర్భాల్లో లేజర్ చికిత్స తరువాత రోగులకు స్టెంట్ వేయాల్సిన అవసరం కూడా ఉండదన్నారు. దీంతో.. రక్తనాళాల గోడలకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా అడ్డంకులను తొలగించి రక్తప్రసరణను పునరుద్ధరించొచ్చని చెప్పారు.
ఈ లేజర్ చికిత్స.. పేషెంట్లకు ఎంతో ప్రయోజనకారి. రోగికి ఇబ్బందులు తక్కువగా ఉండటంతో పాటూ చికిత్స తరువాత కొన్ని రోజుల్లోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిపోవచ్చు. ఆధునాతన చికిత్సలను నాగ్‌పూర్ వైద్యులకు పరిచయం చేయడమే తమ ఉద్దేశమని ‘లైవ్ కాన్క్లేవ్‘ సమావేశం నిర్వాహకులు డా. జస్పాల్ ఆర్నేజా పేర్కొన్నారు. ఈ సమావేశం ద్వారా విదర్భ ప్రాంతంలోని సుమారు 200 మంది వైద్యులు తొలిసారిగా ఈ చికిత్స గురించి తెలుసుకోగలిగారని చెప్పారు.