London: పోస్ట్ చేసిన వందేళ్ల తర్వాత లెటర్ డెలివరీ
- లండన్ లో చోటు చేసుకున్న విచిత్రం
- 1916లో పోస్ట్ చేయగా, 2021లో డెలివరీ
- సార్టింగ్ సమయంలో తప్పిపోయి ఉంటుందన్న అంచనా
పూర్వం వ్యక్తుల మధ్య సంబంధాలకు లేఖలు ముఖ్య వారధిగా ఉండేవి. అప్పట్లో టెలిఫోన్ సౌకర్యం చాలా ప్రాంతాలకు ఉండేది కాదు. అందుకే ఏ సంప్రదింపులు అయినా లేఖల రూపంలో ఉండేవి. లండన్ లో ఓ లేఖ పోస్ట్ చేసిన 100 ఏళ్ల తర్వాత ఇటీవలే డెలివరీ అయింది. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో 1916లో ఈ లేఖను క్రిస్టాబెల్ మెన్నెల్ అనే యువతి తన ఫ్రెండ్ అయిన కేటీ మార్ష్ కు పోస్ట్ చేశారు.
వందేళ్ల తర్వాత 2021లో ఈ లేఖ లండన్ లోని ఓ ఫ్లాట్ వద్ద లెటర్ బాక్స్ లో తేలింది. రాయల్ మెయిల్ సిబ్బంది వందేళ్ల తర్వాత జాగ్రత్తగా డెలివరీ చేసింది. నిజానికి ఈ లేఖను అందుకోవాల్సిన వ్యక్తి భూమిపై లేరు. సంబంధిత ఫ్లాట్ లో ఉండే గ్లెన్ (27) అనే వ్యక్తి ఈ లేఖను చూసి ఆశ్చర్యపోయారు. ఏడాది పాటు ఈ లేఖను అలా చూసిన తర్వాత చివరికి హిస్టారికల్ సొసైటీకి అందించారు. ఇంత కాలం పాటు ఎందుకు డెలివరీ చేయలేదనే దానికి రాయల్ మెయిల్ నుంచి ఎలాంటి సమాధానం లేదు. సార్టింగ్ ఆఫీసులో ఇది తప్పిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.