BBC: ఐటీ అధికారుల ‘సర్వే’ పూర్తయ్యాక.. బీబీసీ స్పందన ఇదే!
- ఎలాంటి భయం, పక్షపాతం లేకుండా రిపోర్టింగ్ ను కొనసాగిస్తామన్న బీబీసీ
- అధికారులకు పూర్తిగా సహకరిస్తామని వెల్లడి
- ఇదంతా త్వరలోనే పరిష్కారమవుతుందని ఆశిస్తున్నట్లు ప్రకటన
బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) కు చెందిన కార్యాలయాల్లో మూడు రోజులపాటు జరిగిన ఐటీ సోదాలు గురువారం రాత్రి ముగిశాయి. బీబీసీలో పని చేసే వారి నుంచి అధికారులు సమాచారం సేకరించారు. కంప్యూటర్లు, ల్యాప్ టాప్ ల నుంచి డేటా కాపీ చేసుకున్నారు. సోదాలు పూర్తయ్యాక బీబీసీ ఒక ప్రకటన విడుదల చేసింది.
‘‘ఢిల్లీ, ముంబైలోని మా కార్యాలయాల నుంచి ఆదాయపన్ను శాఖ అధికారులు వెళ్లిపోయారు. అధికారులకు మేం పూర్తిగా సహకరిస్తూనే ఉంటాం. ఈ అంశం త్వరలోనే పరిష్కారమవుతుందని ఆశిస్తున్నాం’’ అని బీబీసీ తెలిపింది.
తమ సిబ్బందికి అండగా ఉంటున్నామని బీబీసీ చెప్పింది. సోదాల సందర్భంగా కొందరిని అధికారులు చాలా సేపు ప్రశ్నించారని, ఇంకొందరు రాత్రుళ్లు కూడా కార్యాలయంలో ఉండాల్సి వచ్చిందని తెలిపింది. తమ సిబ్బంది సంక్షేమం తమకు అత్యంత ముఖ్యమని పేర్కొంది. తమ కార్యకలాపాలు మళ్లీ యథావిధిగా జరుగుతున్నాయని.. భారతదేశం, ఇతర ప్రాంతాల్లో ఉన్న తమ పాఠకులకు వార్తలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని వివరించింది.
‘‘బీబీసీ అనేది విశ్వసనీయమైన, స్వతంత్ర మీడియా సంస్థ. ఎలాంటి భయం, పక్షపాతం లేకుండా వార్తలు రిపోర్ట్ చేసే మా జర్నలిస్టులు, సహోద్యోగులకు ఎప్పుడూ అండగా నిలబడతాం’’ అని ప్రకటనలో పేర్కొంది.
ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లకు సంబంధించి ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ పేరుతో రెండు పార్టులుగా తీసిన డాక్యుమెంటరీ దేశవిదేశాల్లో దుమారం రేపింది. మోదీపై డాక్యుమెంటరీ రూపొందించిందనే కారణంతోనే బీబీసీని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.