Cheteshwar Pujara: పుజారాకు స్టేడియంలో 'గార్డ్ ఆఫ్ ఆనర్'.. వీడియో ఇదిగో
- కెరియర్ లో వందో టెస్టు ఆడుతున్న పుజారా
- క్యాప్ అందజేసిన లెజండరీ క్రికెటర్ గవాస్కర్
- టెస్ట్ క్రికెట్.. మీ జీవితంలాగే మిమ్మల్ని సవాలు చేస్తుందన్న పుజారా
టీమిండియా వెటరన్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా.. అరుదైన జాబితాలో చోటుదక్కించుకున్నాడు. ఈరోజు ఆస్ట్రేలియాతో మొదలైన టెస్టు అతడికి 100వది. ఈ సందర్భంగా పుజారాకు లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ క్యాప్ అందజేశారు.
వందో టెస్టు ఆడుతున్న పుజారాకు ఇండియా, ఆస్ట్రేలియా జట్లు ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ ఇచ్చాయి. మైదానంలో చెరో వైపు రెండు జట్లు నిలబడగా.. మధ్యలో నుంచి పుజారా వచ్చాడు. ఈ సమయంలో మైదానం చప్పట్లతో మారుమోగింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
సునీల్ గవాస్కర్ నుంచి ట్రోపీ అందుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని పుజారా అన్నాడు. ఆయన లాంటి దిగ్గజాలు తనను ప్రేరేపించారని చెప్పాడు. ‘‘నేను యువకుడిగా ఉన్నప్పుడు భారత్‌కు ఆడాలని అనుకున్నాను. కానీ నేను 100 టెస్టు మ్యాచ్‌లు ఆడతానని ఎప్పుడూ అనుకోలేదు. టెస్ట్ క్రికెట్.. మీ జీవితంలాగే మిమ్మల్ని సవాలు చేస్తుంది’’ అని చెప్పుకొచ్చాడు.
మరోవైపు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. రెండే బంతులు ఎదుర్కొన్న స్టీవ్ స్మిత్.. డక్ ఔట్ అయ్యాడు. షమీ, అశ్విన్ కు చెరో రెండు వికెట్లు పడ్డాయి.