allu aravind: ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ కచ్చితంగా వస్తుంది: అల్లు అరవింద్
- ఆస్కార్ నామినేషన్ లో చోటు దక్కించుకోవడమనేది చిన్న విషయం కాదన్న అరవింద్
- భారతదేశం నుంచి ఓ సినిమా అంతర్జాతీయ స్థాయికి చేరినందుకు గర్వపడాలని వ్యాఖ్య
- ట్రిపుల్ ఆర్ సాధిస్తున్న అరుదైన విజయాలను ఆస్వాదించాలని పిలుపు
ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ కచ్చితంగా వస్తుందని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. అవార్డు వస్తుందని తనకు నమ్మకం ఉందని, ఈ విజయాన్ని ప్రజలందరూ కలిసి వేడుకలా జరుపుకోవాలని చెప్పారు.
ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్ పై అల్లు అరవింద్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ట్రిపుల్ ఆర్ సినిమా ఇప్పటికే ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకుందని, ఆస్కార్ కూడా గెలుచుకుంటుందని, ఈ విషయంలో తనకు నమ్మకం ఉందని చెప్పారు.
‘‘ఆ అవార్డును రాజమౌళి సినిమాకు వచ్చిన గుర్తింపుగా మాత్రమే చూడకుండా.. తెలుగు సినిమాకు, భారతీయ సినిమాకు దక్కిన గౌరవంగా భావించాలి. భారతదేశం నుంచి ఓ సినిమా అంతర్జాతీయ స్థాయికి చేరినందుకు మనమంతా గర్వపడాలి’’ అని వ్యాఖ్యానించారు.
ఆస్కార్ నామినేషన్ లో చోటు దక్కించుకోవడమనేది చిన్న విషయం కాదని, ఇది సినిమా పరిశ్రమకు గొప్ప ప్రోత్సాహం లాంటిందని అల్లు అరవింద్ చెప్పారు. ట్రిపుల్ ఆర్ సాధిస్తున్న అరుదైన విజయాలను ఆస్వాదించాలని అన్నారు.
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. కలెక్షన్ల రికార్డులు కొల్లగొట్టిందీ మూవీ. ఇందులోని ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ కు నామినేట్ అయిన విషయం తెలిసిందే. మార్చి 13న జరగనున్న ఆస్కార్ వేడుకలో అవార్డులను ప్రకటించనున్నారు.