Bopparaju Venkateswarlu: ఉద్యోగులకు లెక్కలు ఎందుకు చెప్పడం లేదు.. జీతాలు భిక్ష వేస్తున్నారా?: బొప్పరాజు ఆగ్రహం

bopparaju venkateswarlu comments over salaries

  • ఉద్యోగులను హింసించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించిన బొప్పరాజు వెంకటేశ్వర్లు
  • తమ సహనాన్ని పరీక్షించొద్దని ఏపీ ప్రభుత్వానికి హెచ్చరిక
  • ఈ నెల 26న తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి

జీతాలు మాకు భిక్ష వేస్తున్నారా? అంటూ వైసీపీ ప్రభుత్వంపై ఏపీ ఐకాస అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉద్యోగులను హింస పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈరోజు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వంలో భాగస్వాములైన ఉద్యోగులకు కూడా లెక్కలు ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. ఉద్యోగులను గాలికి వదిలేశారని మండిపడ్డారు. తమ సహనాన్ని పరీక్షించొద్దని హెచ్చరించారు. ఈ నెల 26న తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.

సంక్రాంతి నాటికి బకాయిలు ఇస్తామని మంత్రుల కమిటీ హామీ ఇచ్చిందని.. కానీ ఇంతవరకు ఇవ్వలేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్ వాటా డబ్బులు 11 నెలలుగా ప్రభుత్వం వాడుకుంటోందని ఆరోపించారు. 

12 లక్షల మంది ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇవ్వకపోతే ఎవరు సిగ్గు పడాలని బొప్పరాజు ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యల పట్ల సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చి పూర్తి జీతాలు ఇవ్వడం లేదని విమర్శించారు. జీతాలు పూర్తి స్కేల్ ఇవ్వాల్సి వస్తుందని క్రమబద్ధీకరణ చేయకపోవడం దారుణమన్నారు.

  • Loading...

More Telugu News