Chandrababu: పోలీసులు అడ్డుకోవడంతో అనపర్తికి కాలి నడకన చంద్రబాబు

Chandrababu arrives Anaparthi by walk after police restrict him

  • ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన
  • బలభద్రపురం వద్ద చంద్రబాబు కాన్వాయ్ ని అడ్డుకున్న పోలీసులు
  • చంద్రబాబు వాహనం ముందు బైఠాయించిన పోలీసులు
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు, టీడీపీ శ్రేణులు

టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రబాబు అనపర్తి వస్తుండగా పోలీసులు ఆయన కాన్వాయ్ ని అడ్డుకున్నారు. బలభద్రపురం వద్ద చంద్రబాబు వాహనం ముందుకు కదలకుండా పోలీసులు రోడ్డుపైనే బైఠాయించారు. ఆయన కాన్వాయ్ కి పోలీసు బస్సును అడ్డం పెట్టారు. 

చంద్రబాబును అడ్డుకున్నారన్న సమాచారంతో పరిసర గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దాంతో చంద్రబాబు పోలీసులపై నిప్పులు చెరుగుతూ బలభద్రపురంలో ప్రసంగించారు.  

పోలీసుల వైఖరికి తాను తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నానని, పోలీసులు తనకు సహకరించడంలేదని, ఇకపై తాను కూడా పోలీసులకు సహాయ నిరాకరణ చేస్తున్నానని ప్రకటించారు. "మీరు చట్టప్రకారం పనిచేయడంలేదు. మీరు నాకు అనుమతి ఇచ్చారు. ఇప్పుడెందుకు అడ్డుకుంటున్నారు? ఎవరో సైకో చెప్పాడని నన్ను ఆపేస్తారా?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

1921లో మహాత్మాగాంధీ నాయకత్వంలో సహాయ నిరాకరణ ఉద్యమం ఏర్పడిందని, తర్వాత కాలంలో అది దండియాత్రగా మారిందని, బ్రిటీష్ పాలన పతనానికి నాంది పలికిందని అన్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని అన్నారు. 

ఎంత మందిపై కేసులు పెడతారో నేనూ చూస్తా అని హెచ్చరించారు. చివరికి మీరు సైకోని కూడా రక్షించలేరని, ఇవాళ ప్రజా ఉద్యమానికి నాంది పలుకుతున్నానని పిలుపునిచ్చారు. ఇది పోలీసు రాజ్యం కాదు... రౌడీ రాజ్యం అంటూ మండిపడ్డారు. 

మీరు అనుమతిస్తారా... లేదా నన్నే ముందుకు వెళ్లమంటారా? అంటూ పోలీసులకు అల్టిమేటమ్ ఇచ్చారు. అయితే పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో, చంద్రబాబు కాలినడకన అనపర్తి బయల్దేరారు. ఆయన వెంట టీడీపీ శ్రేణులు భారీగా తరలిరావడంతో ఓ పాదయాత్రను తలపించింది. కాగా, చంద్రబాబు పర్యటనలో రోడ్ షోకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News