Oral bacteria: నోటిలోని బ్యాక్టీరియాతో ‘హార్ట్ స్ట్రోక్’ రిస్క్.. కొత్త అధ్యయనం
- ఎఫ్. న్యూక్లియేటమ్ తో జాగ్రత్తగా ఉండాల్సిందే
- దీని కారణంగా కరోనరీ హార్ట్ డిసీజ్ రిస్క్
- గుండె జబ్బుల నివారణలో దీనిపైనా దృష్టి పెట్టాల్సిన అవసరం
ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే ప్రతి మూడు మరణాల్లో ఒకటి గుండె జబ్బు వల్లే ఉంటోంది. జన్యు సంబంధిత, జీవనశైలి, పర్యావరణ కాలుష్యం గుండె జబ్బులకు కారణాలుగా ఉంటున్నాయి. అయితే పరిశోధకుల తాజా అధ్యయనం ఫలితాలు పరిశీలిస్తే నోటిలో దుర్వాసనకు కారణమయ్యే, చిగుళ్ల సమస్యలకు దారితీసే బ్యాక్టీరియా కూడా గుండె జబ్బుల రిస్క్ ను పెంచుతుందని తెలుస్తోంది. గుండె జబ్బుల రిస్క్ ను అంచనా వేయడానికి ఇతర అంశాలను కూడా వైద్యులు పరిశీలించాలని ఈ అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులు సూచిస్తున్నారు.
కరోనరీ హార్ట్ డిసీజ్ అనేది గుండె జబ్బుల్లో ఎక్కువగా కనిపించే సమస్య. ఆర్టరీల్లో కొవ్వు పేరుకుని గుండెకు రక్త సరఫరా తగ్గడానికి కారణమవుతుంది. అలాగే, బ్లాకేజ్ ఏర్పడి హార్ట్ ఎటాక్ కు దారితీస్తుంది. అధిక కొవ్వులు, ఇన్ఫెక్షన్లు ఆర్టరీల్లో కొవ్వులు పేరుకునేందుకు కారణంగా గతంలో పరిశోధనలు చెప్పాయి. కానీ, అసలు గుండె జబ్బులకు దారితీసే, అంతగా తెలియని ఇతర కారణాలపై స్విట్జర్లాండ్ లోని పరిశోధకులు దృష్టి సారించారు.
ఎఫ్. న్యూక్లియేటమ్ అనే బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా విడుదలయ్యే యాంటీబాడీలు గుండె జబ్బుల రిస్క్ కు దారితీస్తున్నట్టు గుర్తించారు. నోటిలో ఉన్న ఈ బ్యాక్టీరియా వల్ల సిస్టమిక్ ఇన్ ఫ్లమ్మేషన్ పెరిగి గుండె జబ్బుల రిస్క్ పెంచుతున్నట్టు పరిశోధకులు ప్రకటించారు. కనుక గుండె జబ్బుల నివారణలో ఎఫ్ న్యూక్లియేటమ్ అనే బ్యాక్టీరియా కట్టడిపైనా వైద్యులు దృష్టి సారించాల్సిన అవసరాన్ని అధ్యయనం నొక్కి చెప్పింది.