Taslima Nasreen: ఏదోఒక రోజు తాలిబన్ల చేతుల్లోకి పాకిస్థాన్..: తస్లీమా నస్రీన్
- ఇది జరిగితే తాను ఆశ్చర్యపోనన్న బంగ్లాదేశ్ రచయిత్రి
- కరాచీలో తెహ్రీకే తాలిబన్ల ఆత్మాహుతి దాడి
- దీంతో ఘాటుగా స్పందించిన తస్లీమా నస్రీన్
పాకిస్థాన్ విషయంలో బంగ్లాదేశ్ కు చెందిన ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదో ఒక రోజు పాకిస్థాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. పాకిస్థాన్ లో తెహ్రీకే తాలిబన్ ఆత్మాహుతి దాడి నేపథ్యంలో తస్లీమా నస్రీన్ ఇలా స్పందించారు.
శుక్రవారం కరాచీలోని పోలీసు కాంపౌండ్ లోకి పాకిస్థాన్ తెహ్రీకే తాలిబన్ కు చెందిన ఉగ్రమూక చొరబడగా, ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో తొమ్మిది మంది మరణించారు. ఇందులో తెహ్రీకే తాలిబన్ కు చెందిన ఐదుగురు సాయుధ మిలిటెంట్లు కూడా ఉన్నారు.
కరాచీ ఉగ్రదాడిపై తస్లీమా నస్రీన్ తన ట్విట్టర్ పేజీలో స్పందించారు. ‘‘ఐఎస్ఐఎస్ అవసరం లేదు. పాకిస్థాన్ ను భయభ్రాంతులకు గురి చేయడానికి పాకిస్థాన్ తాలిబన్ చాలు. ఏదో ఒక రోజు తాలిబన్లు పాకిస్థాన్ ను తమ నియంత్రణలోకి తీసుకున్నా నేను ఆశ్చర్యపోను’’ అని ట్వీట్ చేశారు. తస్లీమా నస్రీన్ ఇస్లామిక్ వ్యతిరేక అభిప్రాయాలు, రచనలతో పాప్యులర్ కావడం తెలిసిందే.