Internet: భారతీయుల నెట్ వాడకం పెరుగుతోందట.. ఎంత వాడుతున్నారంటే..!
- సగటున ఒక్కొక్కరు నెలకు 19.5 జీబీ వాడేస్తున్నారు
- నోకియా మొబైల్ బ్రాడ్ బ్యాండ్ అధ్యయనంలో వెల్లడి
- గతేడాదితో పోలిస్తే 13.6 శాతం పెరిగిన నెట్ వినియోగం
చేతిలో స్మార్ట్ ఫోన్ లేకుంటే క్షణం గడవని స్థితికి చేరుకున్నాం.. ఏ పని చేస్తున్నా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే ! యూట్యూబ్, వాట్సాప్, ఫేస్ బుక్ తదితర సోషల్ మీడియా యాప్ లలో గంటల తరబడి మునిగితేలే యువత ఎంతోమంది ఉన్నారు. దీంతో మన దేశంలో ఇంటర్ నెట్ వాడకం బీభత్సంగా పెరిగిపోతోందని గణాంకాలు చెబుతున్నాయి. తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రావడం, ఇంటర్ నెట్ చార్జీలు తగ్గడం కూడా నెట్ వాడకాన్ని పెంచాయి.
ఈ నేపథ్యంలోనే భారతీయుల నెట్ వాడకంపై ఆరా తీసేందుకు అధ్యయనం నిర్వహించగా.. దేశంలో సగటున నెలకు ప్రతీ ఒక్కరూ 19.5 జీబీ వాడుతున్నారని తేలింది. గడిచిన ఏడాదితో పోల్చితే భారత్‌లో డేటా వినియోగం ఏకంగా 13.6 శాతం పెరిగినట్లు తేలింది. ఈమేరకు ఈ వివరాలను నోకియా మొబైల్ బ్రాడ్ బ్యాండ్ ఇండెక్స్ రిపోర్టు వెల్లడించింది.
మొబైల్ ఫోన్లకు సంబంధించిన డేటా వినియోగం గత ఐదేళ్లలో మూడు రెట్లకు పైగా పెరిగింది. 2022కు సంబంధించి మొత్తం డేటా వినియోగంలో 4 జీ నెట్ వర్క్ 99 శాతం షేర్‌తో మొదటి స్థానంలో ఉందని ఈ నివేదికలో తేలింది. ముందుముందు నెట్ వాడకం మన దేశంలో మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.