IT industry: మన దేశంలో భారీ వేతనాలు అందుకుంటున్న టెక్నాలజీ చీఫ్ లు
- విప్రో సీఈవో థీరీ డెల్ పోర్టేకు అత్యధిక వేతనం
- వార్షికంగా రూ.79 కోట్లు చెల్లిస్తున్న విప్రో
- ఇన్ఫోసిస్ సలీల్ పరేఖ్ కు రూ.71 కోట్ల వేతనం
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలకు లాభాలు దండిగా వస్తుంటాయి. చిన్నగా మొదలై దిగ్గజ ఐటీ కంపెనీలుగా మారినవి ఎన్నో ఉన్నాయి. అలాంటి ఐటీ కంపెనీలను నడిపించే బాస్ లకు వేతనాలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోండి. భారీ స్థాయి వేతనాలు చెల్లించడానికి సైతం సిద్ధమే అంటాయి కానీ, సమర్థులైన సీఈవోలను ఏ కంపెనీ కూడా కోల్పోయేందుకు సిద్ధంగా ఉండదు. ఇప్పుడు మన దేశంలో భారీ స్థాయి వేతనాలు అందుకుంటున్న ఐటీ బాస్ ల వివరాలను పరిశీలిస్తే..
విప్రో సీఈవో థీరీ డెల్ పోర్టే అత్యధిక వేతనంలో మొదటి స్థానంలో ఉన్నారని చెప్పుకోవాలి. డెల్ పోర్టేకి ఏడాదికి విప్రో రూ.79 కోట్లను చెల్లిస్తోంది. ఆయనకు చెల్లించే మొత్తం కంపెనీ ఆదాయంలో 0.1 శాతం, లాభంలో 0.65 శాతానికి సమానం. ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ రూ.71 కోట్ల వార్షిక వేతనంలో రెండో స్థానంలో ఉన్నారు. పరేఖ్ తీసుకుంటున్న వేతనం ఇన్ఫోసిస్ ఆదాయంలో 0.06 శాతం, లాభంలో 0.32 శాతానికి సమానంగా ఉంది.
ఎంఫసిస్ సీఈవో నితిన్ ఓం ప్రకాష్ రాకేశ్ కు వార్షిక వేతనం రూ.35 కోట్లుగా ఉంది. ఇది ఎంఫసిస్ ఆదాయంలో 0.29 శాతం, నికర లాభంలో 2.46 శాతానికి సమానం. కేపీఐటీ టెక్నాలజీస్ సీఈవో కిషోర్ పాటిల్ వార్షిక వేతనం 4.5 కోట్లుగా ఉంది. న్యూజెన్ టెక్నాలజీస్ సీఈవో విరేందర్ జీత్ కు వార్షిక వేతనం రూ.3 కోట్లు చెల్లిస్తున్నారు.