Chandrababu: అనపర్తి ఘటనలో గాయపడిన కార్యకర్తలను పరామర్శించిన చంద్రబాబు
- అనపర్తిలో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట
- గాయపడి ఆసుపత్రిపాలైన టీడీపీ కార్యకర్తలు
- ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు
- కార్యకర్తలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో నిన్న పోలీసులతో జరిగిన తోపులాటలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్యకర్తలను టీడీపీ అధినేత చంద్రబాబు నేడు పరామర్శించారు. ఆసుపత్రికి వెళ్లి వారి ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు వారికి తెలిపారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఆసుపత్రి వద్ద చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, నిన్న కొందరు పోలీసులు కావాలని తమ కార్యకర్తలపై దాడి చేశారని ఆరోపించారు. ప్రకాశ్ నాయుడు అనే కార్యకర్తపై పోలీసులు తీవ్రంగా దాడి చేశారని, అతడి గుండెపై బలంగా గుద్దారని వివరించారు. దాంతో ప్రకాశ్ నాయుడు స్పృహతప్పి పడిపోయాడని వెల్లడించారు.
ప్రకాశ్ నాయుడు క్రమంగా కోలుకుంటున్నాడని, అతడిని ఇంకా అబ్జర్వేషన్ లో ఉంచారని చంద్రబాబు వివరించారు. నాడు దండియాత్ర జరిగితే నిన్న అనపర్తి యాత్ర జరిగిందని, ఈ ఘటనల నేపథ్యంలో సహాయ నిరాకరణకు పిలుపునిచ్చానని వెల్లడించారు.
ముందు రోజు తమకు అనుమతి ఇచ్చారని, కానీ సైకో ముఖ్యమంత్రి ఫోన్ చేసి ఒత్తిడి తెచ్చేసరికి ఆ అనుమతి రద్దు చేశారని ఆరోపించారు. చట్ట వ్యతిరేక చర్యలకు పోలీసులను పురిగొల్పి పంపుతున్నారని చంద్రబాబు విమర్శించారు.