Andhra Pradesh: చాక్లెట్ వద్దన్నందుకు బాలికపై వేధింపులు..
- చాక్లెట్ వద్దన్నందుకు విద్యార్థినికి వేధింపులు
- గాజువాకలో వెలుగు చూసిన ఘటన
- నిందితుడి అరెస్ట్..పోక్సో చట్టం కింద కేసు నమోదు
తరచూ బాలిక వెంటపడి వేధింపులకు గురిచేస్తున్న ఓ ఆకతాయిని గాజువాక పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. న్యూపోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాక దరి ఓ కాలనీకి చెందిన ఓ బాలిక(13) 8వ తరగతి చదువుతోంది. ఈ నెల 16న స్కూల్ నుంచి ఆమె తన సోదరితో కలిసి ఇంటికి వెళుతున్న సమయంలో భవన నిర్మాణ కార్మికుడు అప్పారావు అలియాస్ సంతోష్(23) ఆమె వెంటపడి చాక్లెట్ ఇవ్వబోతే ఆమె తిరస్కరించింది. కానీ..అప్పారావు మాత్రం మరి కొంతదూరం ఆమె వెంటే వెళ్లి వేధింపులకు గురి చేయడంతో బాలిక రోదిస్తూ ఇంట్లో వాళ్లకు సమాచారం అందించింది. దీంతో.. వారు అప్పారావును నిలదీసి ఆపై న్యూపోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సంతోష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడు ఏడాదిగా చాక్లెట్ పేరిట బాలికను వేధిస్తున్నట్టు గుర్తించారు. దీంతో.. నిందితుడిని దిశ పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలో పోలీసులు సంతోష్‌పై పోక్సో చట్టం, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. తండ్రి లేని సంతోష్ సోదరుడి వద్దే పెరిగాడని, ఆకతాయిలతో తిరుగుతూ మద్యానికి అలవాటు పడ్డాడని పోలీసులు తెలిపారు.