bihar: బిడ్డకు జన్మనిచ్చిన గంటల వ్యవధిలో పది పరీక్ష రాసిన బీహార్ మహిళ
- బీహార్ లో మొదలైన పదో తరగతి పరీక్షలు
- మొదటి పరీక్ష రాసిన గర్భిణీ.. రెండో పరీక్ష రోజు కాన్పు
- ఆసుపత్రి నుంచి అంబులెన్స్ లో పరీక్ష కేంద్రానికి..
- సిబ్బంది సహకారంతో పరీక్ష పూర్తిచేసిన మహిళ
మనసులో గట్టి సంకల్పం ఉండాలే కానీ సాధించలేనిది ఏదీలేదని నిరూపించే ఘటనలు అక్కడక్కడా జరుగుతుంటాయి.. బీహార్ లోని బంకా జిల్లాలో కూడా ఇలాంటిదే ఓ సంఘటన జరిగింది. బిడ్డకు జన్మనిచ్చిన గంటల వ్యవధిలోనే ఓ తల్లి పదో తరగతి పరీక్ష రాసింది. చదువుపై తనకున్న ఇష్టాన్ని, మరోసారి చదువు ఆగిపోవద్దని గట్టి పట్టుదలను ప్రదర్శించింది.
బంకా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో రుక్మిణి పదో తరగతి చదువుతోంది. పెళ్లి కారణంగా ఆగిపోయిన చదువును భర్త సహకారంతో కొనసాగిస్తోంది. రుక్మిణి వయసు ప్రస్తుతం 22 ఏళ్లు, నిండు గర్భిణీ. బీహార్ లో ఇటీవలే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 14న జరిగిన పరీక్షకు రుక్మిణి హాజరయ్యింది. అయితే, అదేరోజు సాయంత్రం పురుటి నొప్పులు మొదలు కావడంతో కుటుంబ సభ్యులు రుక్మిణిని ఆసుపత్రికి తరలించారు.
మరుసటి రోజు.. అంటే ఈ నెల 15న ఉదయం 6 గంటలకు రుక్మిణి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం.. సైన్స్ పరీక్షకు హాజరవుతానని రుక్మిణి పట్టుబట్టింది. దీంతో అంబులెన్స్ ను, సిబ్బందిని ఏర్పాటుచేసి వైద్యులు ఆమెను పరీక్షా కేంద్రానికి పంపించారు. ఇటు వైద్య సిబ్బంది, అటు పరీక్ష కేంద్రంలో సిబ్బంది సహకారంతో రుక్మిణి పరీక్ష రాసి, తిరిగి ఆసుపత్రికి చేరుకుంది. ఈ పరీక్షలో మంచి మార్కులు సాధిస్తానని చెబుతోంది.