Chandrababu: తారకరత్న పార్థివదేహానికి చంద్రబాబు నివాళులు
- తారకరత్న మృతిపట్ల సంతాపం తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు
- మంచి భవిష్యత్తు ఉన్న వ్యక్తిని కోల్పోయామని ఆవేదన
- ప్రజలకు ఏదో చేయాలనే తపనతో ఉండేవారని వ్యాఖ్య
తారకరత్న భౌతికకాయానికి టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులు అర్పించారు. తన సతీమణి భువనేశ్వరితో కలిసి మోకిలలోని తారకరత్న నివాసానికి చేరుకున్న చంద్రబాబు.. ఆయన చిత్ర పటం వద్ద పుష్ఫాలను ఉంచి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డితో మాట్లాడారు. తారకరత్నకు అందిన వైద్యం, అంత్యక్రియల ఏర్పాట్లపై ఇరువురు చర్చించుకున్నట్టు తెలుస్తోంది. అనంతరం మీడియాతో మాట్లాడిన టీడీపీ అధినేత.. తారకరత్నను కోల్పోయినందుకు విచారం వ్యక్తం చేశారు. కుటుంబం, అభిమానులు ప్రార్థించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘ఈ నెల 22వ తేదీకి తారకరత్నకు 40 సంవత్సరాలు పూర్తవుతాయి. ఒక మంచి భవిష్యత్తు ఉన్న వ్యక్తిని కోల్పోయాం. సినిమా రంగంలో ఒకే రోజు తొమ్మిది సినిమాలు ప్రారంభోత్సవం చేసిన రికార్డు ఆయనది. ‘అమరావతి’ సినిమాలో నటనకు నందీ అవార్డు సొంతం చేసుకున్నారు. ప్రజలకు ఏదో చేయాలనే తపనతో ఉండేవారు. ఈ మారు ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన ఉన్నట్టు చెప్పారు. మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుందామని తారకరత్నతో అన్నా. అలాంటి టైంలో ఆయన చనిపోవడం బాధాకరం’’ అని చంద్రబాబు అన్నారు.