Botsa Satyanarayana: తెల్ల చొక్కా వేసుకుని ఎవరు వచ్చినా తప్పుపడుతారు.. బొత్స సత్యనారాయణ అసహనం
- వైసీపీ నిర్వహించిన సమావేశానికి ఏయూ వీసీ హాజరుకావడంపై బొత్సను ప్రశ్నించిన మీడియా
- వీసీ వచ్చినట్లు వీడియోలు ఉన్నాయా అని ఎదురు ప్రశ్న
- ఉన్నాయని మీడియా చెప్పడంతో.. ‘ఈసీ చూసుకుంటుంది’ అని వెల్లడి
- శివరాత్రి శుభాకాంక్షలు చెబుతూ సీఎం చేసిన ట్వీట్ లో తప్పేముందని వ్యాఖ్య
తెల్ల చొక్కా వేసుకుని ఎవరు వచ్చినా మీడియా తప్పుపడుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ అసహనం వ్యక్తంచేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం వైసీపీ నిర్వహించిన సమావేశానికి ఆంధ్రా యూనివర్శిటీ వీసీ హాజరుకావడంపై మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి దాటవేత సమాధానం ఇచ్చారు. తొలుత అది ఎన్నికల సమావేశం కాదని చెప్పారు. తర్వాత వీసీ వచ్చినట్లు మీడియా దగ్గర వీడియోలు ఉన్నాయా అంటూ ఎదురు ప్రశ్నించారు. ఉన్నాయని మీడియా చెప్పడంతో.. ఆ విషయాన్ని ఈసీ చూసుకుంటుందని దాటవేశారు.
శివరాత్రి శుభాకాంక్షలు చెబుతూ సీఎం జగన్ చేసిన ట్వీట్ లో తప్పేముందని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. బీజేపీ వక్రాభాష్యం ఆపాలని విమర్శించారు. తాము కూడా హిందువులమేనని, అన్నార్తుల ఆకలి తీర్చడానికి ఈశ్వర ఆరాధన అంటే తప్పేముందని ప్రశ్నించారు. ఏదో ఒక రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఏ రకంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ప్రశ్నించారు.
ఎమ్మెల్సీ ఎన్నికను మూడు రాజధానులకు రెఫరెండంగా తీసుకుంటారా? అని మీడియా ప్రశ్నించగా.. సమాధానం చెప్పేందుకు బొత్స నిరాకరించారు. ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని 200 శాతం కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. 200 శాతం విజయం సాధిస్తే రెఫరెండంగా తీసుకోవచ్చు కదా? అని మీడియా మరోసారి అడిగినా.. బొత్స సమాధానం చెప్పకపోవడం గమనార్హం.