Team India: సిరీస్ మధ్యలో జట్టుని విడిచి స్వదేశం వెళ్లిపోయిన ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్
- కుటుంబ పని మీద సోమవారం ఉదయం ప్రయాణం
- మూడో టెస్టు మ్యాచ్ కు ముందు తిరిగొచ్చే అవకాశం
- తొలి రెండు టెస్టుల్లో తేలిపోయిన ఆస్ట్రేలియా
భారత పర్యటనలో ఆస్ట్రేలియా చెత్తగా ఆడుతోంది. నాలుగు టెస్టు సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ ల్లో చిత్తుగా ఓడిపోయి బోర్డర్–గవాస్కర్ ట్రోఫీపై ఆశలు వదులుకుంది. ఇదిలా ఉండగా ఆ జట్టు కెప్టెన్, స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ సిరీస్ మధ్య లో స్వదేశం వెళ్లిపోయాడు. తన కుటుంబానికి సంబంధించిన ప్రైవేట్ విషయం మీద అతను సోమవారం తెల్లవారుజామున ఆస్ట్రేలియా విమానం ఎక్కినట్టు తెలుస్తోంది. అయితే, ఇండోర్‌లో మార్చి 1న ప్రారంభం కానున్న 3వ టెస్టు మ్యాచ్‌కు ముందు కమిన్స్ తిరిగి జట్టులోకి వస్తాడని తెలుస్తోంది. ఒకవేళ అతను తిరిగి జట్టులో చేరలేకపోతే మాత్రం ఆసీస్ కు గట్టి ఎదురు దెబ్బ తగలనుంది.
ఈ సిరీస్‌లో భారత్ చేతిలో క్లీన్‌స్వీప్‌కు గురైతే ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఉంది. ఢిల్లీలో మూడు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్టులో భారత స్పిన్నర్ల ముందు ఆసీస్ బ్యాటర్లు తేలిపోయారు. ఈ మ్యాచ్ తర్వాత కమిన్స్ మాట్లాడుతూ.. తమ బ్యాటర్లు భారత్‌లో పరుగులు సాధించే మార్గాన్ని కనుగొనాలని చెప్పాడు. ‘మ్యాచ్ ఓటమి తర్వాత తమ బ్యాటింగ్ పై ఆటగాళ్లు సమీక్ష చేసుకుంటారని భావిస్తున్నా. ముఖ్యంగా మా షాట్ సెలెక్షన్ సరైన పద్ధతిలోనే ఉందా? లేదా? అనే విషయంపై ఆలోచించుకోవాలి. దురదృష్టవశాత్తూ మాలో చాలా మంది క్రాస్-బ్యాటింగ్ షాట్లతో ఔట్ అయ్యారు. ఇది మేం ఇష్టపడే పద్ధతి కాకపోవచ్చు’ అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.