Morbi Bridge collapse: ప్రమాదానికి ముందే తీగలు తెగిపోయి ఉండొచ్చు.. మోర్బీ వంతెన కూలడంపై సిట్ నివేదిక
- మోర్బీ వంతెన ప్రమాదంపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన సిట్
- ప్రధాన భాగాలకు తుప్పుపట్టిందని వెల్లడి
- ప్రమాదానికి ముందే వంతెన తీగలు తెగిపోయి ఉండొచ్చన్న సిట్
గతేడాది గుజరాత్‌లో మోర్బీ వంతెన కూలడానికి కారణాలను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. వంతెనను నిలిపివుంచే ఓ కేబుల్‌లో సగానికి పైగా ఇనుప వైర్లు తుప్పుపట్టిపోయాయని నివేదికలో పేర్కొంది. వంతెనపై పాత సస్పెండర్లను కొత్త వాటితో కలుపుతూ చేసిన వెల్డింగ్‌కు కూడా తుప్పుపట్టిందని పేర్కొంది. ప్రమాదానికి దారి తీసిన కారణాల్లో ఇవి ప్రధానమైనవని పేర్కొంది.
అలాగే, వంతెనకు ఆధారమైన రెండు ప్రధాన కేబుళ్లలో ఒకదానిలోని ఇనుప వైర్లు ప్రమాదానికి ముందే తెగిపోయి ఉండొచ్చని అభిప్రాయపడింది. ఈ మేరకు సిట్ తన ప్రాథమిక దర్యాప్తు నివేదికను గత డిసెంబర్‌లోనే ప్రభుత్వానికి సమర్పించినట్టు తెలుస్తోంది. సిట్ నివేదిక ప్రకారం.. నదికి ఎగువ వైపున ఉన్న వంతెన కేబుల్ ఒకటి తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
మోర్బీలోని మచ్ఛు నదిపై నిర్మించిన ఈ తీగల వంతెన గతేడాది అక్టోబర్ 30న కూలిపోయిన విషయం తెలిసిందే. బ్రిటీష్ కాలంనాటి వంతెన మరమ్మతులు, నిర్వహణ బాధ్యతలను ఒరెవా గ్రూప్ చేపట్టింది. ఇందులో చాలా లోపాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఒరెవా గ్రూప్ ఎండీ సహా మొత్తం పది మందిని అరెస్టు చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.