BRS: బీఆర్ఎస్ లో చేరడమెలా ? అంటూ మహారాష్ట్ర నుంచి ఎమ్మెల్సీ కవితకు ట్వీట్
- దేశవ్యాప్తంగా జరిగే పార్టీ ప్రోగ్రామ్ లలో పాల్గొనాలని కవిత సూచన
- ఇటీవలే నాందేడ్ లో బీఆర్ఎస్ బహిరంగ సభ
- పెద్ద సంఖ్యలో హాజరైన స్థానికులు
మహారాష్ట్రలోని నాందేడ్ లో నిర్వహించిన భారీ మీటింగ్ తర్వాత భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి అక్కడ కూడా ఆదరణ పెరుగుతోంది. ఈ సభకు పెద్ద సంఖ్యలో హాజరైన జనం, కేసీఆర్ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. ఈ మీటింగ్ తర్వాత బీఆర్ఎస్ లో చేరేందుకు చాలామంది రెడీ అయ్యారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్ర నుంచి ఓ యువకుడు తెలంగాణ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ నేత కల్వకుంట్ల కవితకు ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ లో చేరాలని ఉంది.. అందుకు ఏం చేయాలో చెప్పాలంటూ ఆ ట్వీట్ లో కోరాడు. దీనికి ఎమ్మెల్సీ కవిత జవాబిస్తూ.. దేశవ్యాప్తంగా జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభలు, కార్యక్రమాల్లో పాల్గొని, సీఎం కేసీఆర్ కు మద్దతు పలకాలని సూచించారు.
మరోవైపు, ఎమ్మెల్సీ కవిత ఈ నెల 25న ముంబైలో పర్యటించున్నారు. ‘2024 ఎన్నికలు- విపక్షాల వ్యూహం’ అనే అంశంపై జరగనున్న చర్చలో కవిత పాల్గొంటారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన రైతుబంధు, దళిత బంధు, బీమా వంటి సంక్షేమ పథకాల గురించి ఎమ్మెల్సీ కవిత వివరిస్తారు.