balloon: కల్వకుర్తిలో భయాందోళనలు సృష్టించిన భారీ బెలూన్
- మామిడితోటలో పడిపోయిన బెలూన్
- కాసేపటికే అక్కడికి చేరుకున్న సైంటిస్టులు
- వాతావరణ పరిశోధన కోసం పంపామని వివరణ
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఆదివారం కలకలం రేగింది. ఆకాశంలో నుంచి ఉన్నట్టుండి ఓ భారీ బెలూన్ పడిపోవడమే దీనికి కారణం. తర్నికల్ గ్రామం సమీపంలోని వ్యవసాయ పొలాల పక్కనే ఉన్న మామిడితోటలో ఈ బెలూన్ పడిపోయింది. దీంతో తర్నికల్ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో జనం ఆందోళనకు గురయ్యారు. అయితే, బెలూన్ కూలిపోయిన కాసేపటికి టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్) కు చెందిన సైంటిస్టులు, అధికారులు అక్కడికి చేరుకున్నారు.
వాతావరణ మార్పులు, నక్షత్రాలపై పరిశోధన కోసం ప్రయోగించిన బెలూన్ అని, దీంతో ఎలాంటి ముప్పులేదని వివరించడంతో గ్రామస్థులలో ఆందోళన తగ్గింది. శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో పరిశోధన కోసం ఈ భారీ బెలూన్ ను ఆకాశంలోకి ఎగరవేసినట్లు అధికారులు తెలిపారు. ఆకాశంలో దాదాపు 32 కిలోమీటర్ల మేర పైకి పంపించినట్లు చెప్పారు.
ఈ సైన్స్ ఫిట్ బెలూన్ తో వాతావరణంలో మార్పులు, నక్షత్రాల కదలికలకు సంబంధించిన సమాచారం సేకరించినట్లు వివరించారు. అనంతరం ఈ బెలూన్ ను కూల్చేశామని పేర్కొన్నారు. ఈ తరహా బెలూన్ల ప్రయోగం గతంలోనూ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 500 బెలూన్లను ప్రయోగించామని, వీటితో ఎలాంటి ప్రాణ హాని ఉండదని అధికారులు వివరించారు.