blood pressure: బీపీ ఒక్కటే కాదు.. పలు రకాలున్నాయ్!
- బయటకు లక్షణాలు లేకుండా లోపలే బీపీ పెరిగిపోవచ్చు
- ఇతర అవయవాలకు సమస్యలతో పెరిగిపోయే రక్తపోటు
- గర్భధారణ సమయంలో పెరిగే జెస్టేషనల్ బీపీ
బీపీని సైలంట్ కిల్లర్ గా సంబోధిస్తుంటారు. గుండె రక్తాన్ని పంప్ చేసినప్పుడు.. ధమనుల నుంచి రక్తం సరఫరా అయ్యే సమయంలో పడే ఒత్తిడిని రక్తపోటుగా చెబుతారు. రక్తపోటు/బ్లడ్ ప్రెజర్ తప్పనిసరిగా ఉండాలి. కాకపోతే అది నియంత్రణల మధ్య ఉన్నప్పుడే మనకు మంచిది. రక్తాన్ని పంప్ చేసే సమయంలో పీడనం పెరిగిపోతే ఎన్నో సమస్యలు వస్తుంటాయి. హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకని రక్తపోటును నిర్లక్ష్యం చేయవద్దు. ఈ రక్తపోటును పలు రకాలుగా వర్గీకరిస్తారు.
ప్రైమరీ హైపర్ టెన్షన్
బయటకు లక్షణాలు కనిపించవు. పరీక్ష చేయించుకుంటే ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా ప్రైమరీ హైపర్ టెన్షన్ ఉన్న వారిలో చాలా మంది సమస్యను గుర్తించి, చికిత్స తీసుకోరు. స్థూలకాయం, డయాబెటిస్ మెల్లిటస్, గుండె జబ్బుల చరిత్ర, 60 ఏళ్లు నిండిన వారు, పొగతాగే అలవాటు ఉన్నవారికి ప్రైమరీ హైపర్ టెన్షన్ రిస్క్ ఉంటుంది.
సెకండరీ హైపర్ టెన్షన్
ఇతర వైద్య పరమైన సమస్య వల్ల వచ్చే దాన్ని సెకండరీ హైపర్ టెన్షన్ గా చెబుతారు. కిడ్నీ సమస్యలు లేదంటే గుండె ధమనుల్లో సమస్యలు, గుండె, ఎండోక్రైన్ వ్యవస్థలో సమస్యల వల్ల ఇది రావచ్చు, గర్భిణులకు సైతం సెకండరీ హైపర్ టెన్షన్ రిస్క్ ఉంటుంది.
జెస్టేషనల్ హైపర్ టెన్షన్
గర్భధారణ సమయంలో మహిళల్లో వచ్చే బీపీని (అప్పటి వరకు లేకుండా) జెస్టేషనల్ హైపర్ టెన్షన్ గా చెబుతారు. దీనివల్ల కొన్ని సమయాల్లో తల్లితోపాటు గర్భంలోని బిడ్డ ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుంది. లేదంటే గర్భంలోని శిశువులో లోపాలకు దారితీయవచ్చు.
వైట్ కోట్ హైపర్ టెన్షన్
హాస్పిటల్ కు వెళ్లిన సమయంలో చూస్తే బీపీ పెరిగిపోతుంది. ఆసుపత్రి నుంచి బయటకు రాగానే సాధారణ స్థితికి వచ్చేస్తుంది. దీన్ని వైట్ కోట్ హైపర్ టెన్షన్ గా చెబుతారు.
రెసిస్టెన్స్ హైపర్ టెన్షన్
ఇది మందులకు లొంగని రక్తపోటు. మూడు రకాల హైపర్ టెన్సివ్ ఔషధాలు ఇచ్చినప్పటికీ నియత్రణలోకి రాదు. దీనికి అబ్ స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, రీనల్ ఆర్టరీ స్టెనోసిస్, రీనల్ పేరెంచిమల్ డిసీజ్.. ఇలా చాలా రకాల కారణాలు ఉన్నాయి.
నియంత్రణలు
రక్తపోటు నియంత్రణకు సొంత వైద్యం పనికిరాదు. తెలిసీ తెలియని సమాచారంతో, ఆయుర్వేద మందులతో ప్రయత్నించడం వల్ల ఉపయోగం పెద్దగా ఉండదు. యాంజియోటెన్సిన్ రిసెప్టర్ (ఏఆర్ బీలు), క్యాల్షియం చానల్ బ్లాకర్స్(సీసీబీ) ఔషధాలు తీసుకోవాల్సి రావచ్చు. వైద్యులు రక్తపోటు ఎందుకు వస్తుందో గుర్తించి, తగిన ఔషధాలు సూచిస్తారు. కనుక అధిక రక్తపోటు బాధితులు వైద్యుల సూచన మేరకు నడుచుకోవడం శ్రేయస్కరం.