BRS: ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు
- గవర్నర్ తమిళిసైపై అనుచిత వ్యాఖ్యలపై విచారణ చేపట్టిన కమిషన్
- ఈ నెల 21న ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని ఆదేశం
- లేదంటే తదుపరి చర్యలు ఉంటాయని హెచ్చరిక
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పై కౌశిక్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంఘటనపై విచారణ చేపట్టిన మహిళా కమిషన్ మంగళవారం ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. విచారణకు రాకపోతే తదుపరి చర్యలుంటాయని హెచ్చరించింది. జాతీయ మహిళా కమిషన్ కార్యదర్శి బర్నాలీ షోమే ఈనెల 14వ తేదీనే ఈ నోటీసులు జారీ చేశారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
గత నెల కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసైని ఉద్దేశించి కౌశిక్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించి పంపిన బిల్లులను గవర్నర్ తన దగ్గరే పెట్టుకున్నారని చెపుతూ అసభ్య పదజాలం ఉపయోగించారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. గవర్నర్ పై కౌశిక్ చేసిన అనుచిత వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ సూమోటోగా స్వీకరించింది. కౌశిక్ వ్యాఖ్యలు గవర్నర్ ప్రతిష్ట, గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని నోటీసుల్లో పేర్కొంది. దీనిపై ఈనెల 21న ఉదయం 11.30 గంటలకు కమిషన్ చైర్ పర్సన్ ఆధ్వర్యంలో నిర్వహించే విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.