SK University: సిబ్బంది చనిపోతున్నారంటూ ఎస్కే యూనివర్సిటీలో హోమం... విద్యార్థి సంఘాల ఆందోళన
- వీసీ చర్యపై భగ్గుమంటున్న విద్యార్థి సంఘాలు
- మేధావులను తయారుచేసే చోట హోమాలేంటని ఆగ్రహం
- పైగా డబ్బులు వసూలు చేస్తారా అంటూ నిలదీసిన వైనం
అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఆశ్చర్యకర పరిస్థితి నెలకొంది. వర్సిటీ సిబ్బంది వరుసగా చనిపోతున్నారంటూ హోమం నిర్వహించగా, విద్యార్థి సంఘాలు వ్యతిరేకించాయి.
ఎస్కే యూనివర్సిటీలో హోమం నిర్వహించడంపై విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. మేధావులను తయారు చేసే చోట ఇలాంటి కార్యక్రమాలు ఏంటని విద్యార్థి సంఘాల నేతలు అభ్యంతరం వెలిబుచ్చారు. బోధనేతర సిబ్బందికి జీతాలు ఇవ్వడంలేదని, కానీ హోమాలకు మాత్రం డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.
దీనిపై ఎస్కే యూనివర్సిటీ వైస్ చాన్సలర్ రామకృష్ణారెడ్డి స్పందించారు. ఇది అందరూ క్షేమంగా ఉండాలని తలపెట్టిన హోమం అని వివరణ ఇచ్చారు. యూనివర్సిటీ సిబ్బంది చనిపోతుండడంతో హోమం నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
"నా సొంత డబ్బుతో హోమం నిర్వహిస్తానని చెప్పాను. కానీ కొందరు సిబ్బంది తాము కూడా డబ్బు ఇస్తామని ముందుకొచ్చారు" అని వీసీ వివరించారు.