Nirmala Sitharaman: పెట్రోల్, డీజిల్ లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం రాష్ట్రాలకు చెందిన విషయం: నిర్మలా సీతారామన్
- పెట్రోలియం ఉత్పత్తులపై జీఎస్టీ కేంద్రం పరిధిలో లేదన్న నిర్మల
- ప్రతిపాదనలను జీఎస్టీ మండలి అజెండాలో చేర్చుతామని వెల్లడి
- రాష్ట్ర ప్రభుత్వాలే ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవాలని వివరణ
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ జైపూర్ లో బడ్జెట్ అనంతర చర్చ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జీఎస్టీ అంశాలపై స్పందించారు. పెట్రోల్, డీజిల్ లను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే అంశం కేంద్రం నిర్ణయంపై ఆధారపడి లేదని, ఆ నిర్ణయంలో రాష్ట్రాలదే కీలకపాత్ర అని స్పష్టం చేశారు.
పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే ప్రతిపాదనలను జీఎస్టీ కౌన్సిల్ అజెండాలో పెడుతున్నామని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలే ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా జీఎస్టీ మండలి సమావేశంలో తమ నిర్ణయాన్ని వెల్లడించాలని సూచించారు.
ఇక, చత్తీస్ గఢ్ లో మైనింగ్ స్కాం నేపథ్యంలో కాంగ్రెస్ నేతలపై ఈడీ దాడులు చేపట్టడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు నిర్మల బదులిచ్చారు. ఈడీ కానీ, సీబీఐ కానీ, ఐటీ శాఖ కానీ ముందుగా పూర్తి కసరత్తు చేసి, ప్రాథమిక ఆధారాలు ఉంటేనే దాడులు, తనిఖీలు చేపడతాయని స్పష్టం చేశారు.
ప్రతీకార ధోరణిలో కేంద్రం వ్యవహరిస్తోందన్న కాంగ్రెస్ నేతల ఆరోపణలను ఆమె ఖండించారు. వాస్తవాలు తెలియకుండా కాంగ్రెస్ ఈ అంశాలపై రాద్ధాంతం చేయడం సరికాదని హితవు పలికారు. అవినీతి, అధికార దుర్వినియోగం గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆమె విమర్శించారు.