Jaya Prada: చేసిన పాపాలకు మూల్యం చెల్లించుకోక తప్పదు: ఆజంఖాన్‌పై జయప్రద ఫైర్
- ఇక ఆజంఖాన్ పని అయిపోయినట్టేనన్న జయప్రద
- ఆజంఖాన్, ఆయన కుమారుడికి మహిళలను గౌరవించడం తెలియదన్న బీజేపీ నేత
- అధికార గర్వం ఉండకూడదన్న మాజీ ఎంపీ
సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్, ఆయన కుమారుడు అబ్దుల్లా ఆజంలకు మహిళలను గౌరవించడం తెలియదని, ఇక ఆజంఖాన్ పని అయిపోయినట్టేనని, చేసిన పాపాలకు ఆజంఖాన్, ఆయన కుమారుడు మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ ఎంపీ, బీజేపీ నేత జయప్రద అన్నారు. ఆదివారం మీరఠ్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ అధికార గర్వం ఉండకూడదని అన్నారు. మహిళలను గౌరవించాలని, పేదలు, అట్టడుగు వర్గాల వారికి న్యాయం చేయాలని అన్నారు.
2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా విద్వేష ప్రసంగం చేశారంటూ నమోదైన కేసులో ఆజంఖాన్‌ను దోషిగా తేల్చిన కోర్టు మూడేళ్ల జైలుశిక్ష విధించింది. దీంతో ఆయన శాసనసభ సభ్వత్యాన్ని కోల్పోయారు. 2008లో ఓ ధర్నాకు సంబంధించిన కేసులో ఆజంఖాన్ కుమారుడు అబ్దుల్లాకు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన కూడా ఎమ్మెల్యే పదవిని కోల్పోయారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆజంఖాన్‌పై అప్పట్లో కేసు నమోదైంది.