Wipro: ఫ్రెషర్లకు భారీ షాకిచ్చిన విప్రో.. ఆఫర్ చేసిన ప్యాకేజీలో సగానికి సగం కోత!
- ఫ్రెషర్లకు గతంలో రూ. 6.5 లక్షలతో వేతన ప్యాకేజీని ఆఫర్ చేసిన విప్రో
- శిక్షణ పూర్తయ్యాక రూ. 3.5 లక్షలకు తగ్గించిన సంస్థ
- దీనికి అంగీకరిస్తే విధుల్లో చేరాలంటూ ఈమెయిల్స్
టెక్నాలజీ కంపెనీల్లో ప్రస్తుతం తీవ్ర అనిశ్చితి కొనసాగుతోంది. ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం వంటి కారణాలను సాకుగా చూపుతూ ఐటీ కంపెనీలు వేలమంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ నుంచి ట్విట్టర్ వరకు పలు కంపెనీలు లే ఆఫ్‌లతో ఉద్యోగులను హడలెత్తించాయి. తాజాగా, విప్రో టెక్నాలజీస్ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. అయితే, ఉద్యోగులను ఇంటికి పంపకుండా వేతనంలో కోత విధించింది.
2022-23 వెలాసిటీ పట్టభద్రుల విభాగంలో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి తొలుత 6.5 లక్షల వేతన ప్యాకేజీని విప్రో ఆఫర్ చేసింది. శిక్షణ పూర్తి చేసుకున్న వారిని వచ్చే నెల నుంచి విధుల్లోకి తీసుకునే ప్రక్రియను ప్రారంభించింది. అయితే, గతంలో ప్రకటించినట్టుగా 6.5 లక్షల ప్యాకేజీ కాకుండా రూ. మూడున్నర లక్షల ప్యాకేజీ మాత్రమే ఇస్తామంటూ వారికి ఈమెయిల్స్ ద్వారా సమాచారం అందించింది.
ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తమ వ్యాపార అవసరాలకు తగినట్టుగా నియామకాల్లో సర్దుబాట్లు చేసుకుంటున్నట్టు ఆ మెయిల్లో విప్రో పేర్కొంది. ఈ ఆఫర్‌కు అంగీకరించి వెంటనే విధుల్లో చేరాలని, దీనికి ఓకే అంటే గత ఆఫర్ రద్దవుతుందని తెలిపింది. కాగా, శిక్షణ సమయంలోనే పనితీరు సరిగా లేదంటూ 425 మందిని ఇటీవల విప్రో ఇంటికి పంపింది. ఇప్పుడు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి వేతన తగ్గింపుతో షాకిచ్చింది.