Ukraine: బైడెన్ ఉక్రెయిన్ ప్రయాణం ఆద్యంతం రహస్యమే..!
- చిన్న విమానం, కొద్దిమంది సెక్యూరిటీ సిబ్బందితో టూర్
- ఇరు దేశాల్లో కొందరు ముఖ్యులకు మాత్రమే సమాచారం
- వెంట వచ్చిన జర్నలిస్టులు కూడా బైడెన్ ను చూడలేదట
- విమానం, రైలులో దాదాపు పది గంటల పాటు ప్రయాణం
బాంబు మోతలతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్ లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం పర్యటించారు. సోమవారం ఉదయం ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో బైడెన్ ప్రత్యక్షం కావడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. వాషింగ్టన్ లో బయలుదేరినప్పటి నుంచి కీవ్ లో అడుగుపెట్టే వరకూ బైడెన్ పర్యటన ఆసాంతం అత్యంత రహస్యంగా కొనసాగింది. ఇరు దేశాలకు చెందిన కొందరు ముఖ్యమైన అధికారులు తప్ప ఇతరులకు ఈ టూర్ వివరాలు తెలియనివ్వలేదు.
అంతెందుకు.. బైడెన్ టూర్ లో ఇద్దరు జర్నలిస్టులు కూడా ఉన్నారు. వారు కూడా ఆయనతో పాటే అదే విమానంలో, రైలులో ప్రయాణించారు. అయినప్పటికీ కీవ్ లో దిగేంత వరకూ తాము బైడెన్ ను చూడనేలేదని చెప్పారంటే ఈ టూర్ ఎంత రహస్యంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు.
ఆదివారం ఉదయం 4 గంటల ప్రాంతంలో వాషింగ్టన్ లోని మిలిటరీ ఎయిర్ పోర్ట హ్యాంగర్ నుంచి బైడెన్ టూర్ మొదలైంది. ఎయిర్ ఫోర్స్ కు చెందిన బోయింగ్ 757 విమానం సీ-32 అనే చిన్న విమానంలో అధ్యక్షుడు, ఆయన అధికారుల బృందం, సెక్యూరిటీ సిబ్బంది, వైద్య బృందం, ఒక జర్నలిస్టు, మరో ఫొటోగ్రాఫర్ లతో విమానం బయలుదేరింది. సుమారు ఏడు గంటలు ప్రయాణించి జర్మనీలోని అమెరికన్ మిలిటరీ బేస్ స్టేషన్ లో విమానం ల్యాండ్ అయింది.
ఇంధనం నింపుకున్నాక తిరిగి బయలుదేరింది. అయితే, అక్కడి సిబ్బందికి కూడా విమానంలో ఎవరున్నదీ తెలియలేదు. విమానం కిటికీ తెరలన్నీ దించేసి ఉన్నాయి. తర్వాత విమానం పోలాండ్ లోని ర్జెస్జో-జసియోంకా ఎయిర్ పోర్టులో దిగింది. అక్కడి నుంచి వాహనాల్లో ఉక్రెయిన్ సరిహద్దులకు దగ్గర్లోని రైల్వే స్టేషన్ కు బైడెన్ చేరుకున్నారు. ఈ ప్రయాణంలోనూ ఎలాంటి హడావుడి లేదు.
ముందు సెక్యూరిటీ వాహనాలు కానీ, సైరెన్ శబ్దం కానీ లేకుండా జర్నీ సాగింది. పోలాండ్ సరిహద్దుల నుంచి బైడెన్ రైలులో కీవ్ కు బయలుదేరారు. సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో బైడెన్ కీవ్ లో అడుగుపెట్టారు. సాధారణంగా అమెరికా ప్రెసిడెంట్ ఎక్కడికి వెళ్లినా సరే వెంట 13 మంది జర్నలిస్టులు తప్పనిసరిగా ఉంటారు. దేశంలో, విదేశాల్లో పర్యటించినా సరే ఈ బృందం ప్రెసిడెంట్ వెన్నంటి ఉంటుంది. బైడెన్ మాట్లాడే ప్రతీ మాటను వారు రికార్డు చేసి ప్రచురిస్తారు. ఉక్రెయిన్ టూర్ అత్యంత రహస్యంగా సాగడంతో జర్నలిస్టుల సంఖ్యను కుదించారు.
వాల్ స్ట్రీట్ జర్నల్ కు చెందిన సబ్రీనా సిద్దికీతో పాటు అసోసియేటెడ్ ప్రెస్ కు చెందిన ఓ ఫొటోగ్రాఫర్ ను వెంట తీసుకెళ్లారు. అయితే, పర్యటన వివరాలను గోప్యంగా ఉంచుతామని వారి నుంచి హామీ తీసుకున్నారు. అదేవిధంగా విమానంలోకి ఎక్కే ముందే వారిద్దరి ఫోన్లనూ సెక్యూరిటీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. కీవ్ కు చేరుకున్నాకే ఫోన్లను తిరిగిచ్చారు. ఇందులో విశేషం ఏంటంటే.. బైడెన్ తో పాటు అదే విమానంలో, వాహనాల్లో ప్రయాణించినా సరే కీవ్ చేరుకునేంత వరకూ తాము ప్రెసిడెంట్ ను చూడనేలేదని జర్నలిస్ట్ సబ్రీనా చెప్పారు. వైట్ హౌస్ అనుమతి వచ్చాక బైడెన్ టూర్ కు సంబంధించిన విశేషాలను ఆమె బయటపెట్టారు.