Tamilisai Soundararajan: తన లాంటి ప్రతిభావంతులను తమిళులు గుర్తించడం లేదన్న గవర్నర్!

People of TamilNadu failed to recognise our talents says Tamilisai
  • తమ ప్రతిభను గుర్తించి ఉంటే.. ఎంపీలుగా గెలిచి కేంద్ర మంత్రులయ్యే వాళ్లమన్న తమిళిసై
  • తమ సత్తాను తెలుసుకుని కేంద్రం గవర్నర్‌ పదవినిచ్చిందని వ్యాఖ్య
  • ప్రజల కోసం కష్టపడి సేవలందిస్తుంటే వార్తలుగా రావడం లేదని అసహనం
  • మహాబలిపురంలో జారిపడితే అదో పెద్ద వార్తగా మారిందని విమర్శ
తనలాంటి ప్రతిభావంతులను తమిళ ప్రజలు గుర్తించడం లేదని తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్‌ తమిళిసై వాపోయారు. ‘‘నా లాంటి ప్రతిభావంతులకు తమిళనాట గుర్తించకపోయినా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. మా సత్తాను తెలుసుకుని గవర్నర్‌ పదవినిచ్చింది’’ అని చెప్పారు. కోయంబత్తూరులోని పీళమేడులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తమిళిసై మాట్లాడారు. 

తన లాంటి వ్యక్తుల ప్రతిభాపాటవాలు వృథా కాకూడదనే కేంద్ర ప్రభుత్వం తమను గుర్తించి పదవులలో కూర్చోబెడుతోందని తమిళి సై అన్నారు. తమ ప్రతిభను తమిళ ప్రజలు గుర్తించి ఉంటే.. ఎంపీలుగా గెలిచి కేంద్రమంత్రులుగా ఉండే వాళ్లమని చెప్పారు. పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై పోరాడి ఉండే వాళ్లమని అన్నారు.

‘‘ఈ కార్యక్రమానికి రెండు సెల్‌ఫోన్లు పట్టుకుని వస్తుండగా ఓ పెద్దాయన పలకరించారు. ‘రెండు సెల్‌ఫోన్లు ఎలా వాడుతున్నారు?’ అని ఆయన ప్రశ్నించారు. ‘రెండు రాష్ట్రాల పాలనా వ్యవహారాలను చూస్తున్న నాకు అదో లెక్కా’ అని చెప్పాను’’ అని తమిళిసై వివరించారు.

తాను 48 గంటలపాటు పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ప్రజల కోసం కష్టపడి సేవలందిస్తుంటే వార్తలుగా రావడం లేదని, కానీ ఆదివారం మహాబలిపురం కార్యక్రమంలో జారిపడితే వెంటనే అదో పెద్ద వార్తగా మారిందని తమిళిసై విమర్శించారు.
Tamilisai Soundararajan
Tamilnadu
People failed to recognise our talents
Telangana
Governor
puducherry

More Telugu News