Yuvagalam: అడ్డంకులు దాటుకుంటూ సాగుతున్న యువగళం యాత్ర
- 300 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న నారా లోకేశ్
- ప్రతీ వంద కిలోమీటర్లకు ఓ అభివృద్ధి పనికి హామీ ఇస్తున్న యువనేత
- తొండమానుపురం సహా చుట్టుపక్కల గ్రామాల దాహార్తి తీరుస్తామని హామీ
- టీడీపీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఏర్పాటు చేస్తామని లోకేశ్ ప్రకటన
అడుగడుగునా వైసీపీ సర్కారు పెడుతున్న అడ్డంకులను దాటుకుంటూ యువగళం యాత్ర ముందుకు సాగుతోంది. నారా లోకేశ్ చేపట్టిన ఈ పాదయాత్ర మంగళవారం 300 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొండమానుపురం పంచాయతిలో ఈ మైలురాయిని లోకేశ్ చేరుకున్నారు. తను వేసే ప్రతీ అడుగూ ప్రజల కోసమేనని ప్రకటించిన లోకేశ్.. ప్రతీ వంద కిలోమీటర్ల మజిలీలోనూ ఓ అభివృద్ధి పనికి హామీ ఇస్తున్నారు. స్థానిక సమస్యకు పరిష్కారం చూపుతూనే అభివృద్ధివైపు అడుగులు పడేలా పథకాలను రూపొందిస్తున్నారు.
తొండమానుపురం పంచాయతీ పరిధిలోని 13 గ్రామాల ప్రజల దాహార్తిని తీరుస్తామంటూ లోకేశ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. తన యాత్ర 300 కిలోమీటర్ల మజిలీ చిరకాలం గుర్తుండిపోయేలా తాగునీటి పథకం ఏర్పాటు చేసి, 13 గ్రామాల్లోని ఇంటింటికీ నీరందిస్తామని పేర్కొన్నారు. చల్లపాలెం, వెంకటాపురం, సుబ్బనాయుడు కండ్రిగ, తొండమనాడు, చెర్లోపల్లి, అమ్మపాళ్యం, కొత్తపాలెం, మున్న సముద్రం, బొక్కసం పాలెం, సిద్ధయ్య గుంట, మర్లపాకు, రాచగున్నేరి, మద్దిలేడు గ్రామవాసుల తాగునీటి కష్టాలను తొలగిస్తామని లోకేశ్ మాటిచ్చారు.
తొండమనాడులో రైతులతో లోకేశ్ మాటామంతి..
పాదయాత్రలో సందర్భంగా తనకు ఎదురైన ప్రజలను లోకేశ్ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటున్నారు. తొండమనాడు గ్రామంలో వరి పొలంలో పురుగుమందు పిచికారీ చేస్తున్న రైతులను లోకేశ్ పలకరించారు. దీంతో ఆ రైతులు తమ కష్టాలను లోకేశ్ కు చెప్పుకున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, పెట్టుబడి ఖర్చు బాగా పెరిగిందని చెప్పారు. నకిలీ విత్తనాలు, ఎరువుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నట్లు తెలిపారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై నారా లోకేశ్ స్పందిస్తూ.. రైతు రాజ్యం తెస్తానని రైతులేని రాజ్యం తెచ్చారని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. రూ.3,500 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని వైసీపీ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తుచేశారు. ఆ నిధి ఏర్పాటు సంగతి ఏమైందో ఇప్పుడు ఎవరూ మాట్లాడట్లేదని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందిస్తామని లోకేశ్ వారికి హామీ ఇచ్చారు.
మహిళల కష్టాలను వింటూ..
గ్రామంలో గ్యాస్ సిలిండర్ తీసుకోవడానికి వచ్చిన మహిళలను లోకేశ్ పలకరించారు. దీంతో నిత్యావసర సరుకుల ధరలు అందుకోలేనంత ఎత్తుకు చేరాయని ఆడపడుచులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ ధర చుక్కలను అంటుతోందని, గతంలో వచ్చిన సబ్సిడీ కూడా ఇప్పుడు రావడంలేదని చెప్పారు. కరెంట్ ఛార్జీలు, చెత్త పన్ను, ఇంటి పన్ను అంటూ ప్రభుత్వం తమ ముక్కు పిండి మరీ పన్నులు వసూలు చేస్తోందని, తమ ఆదాయం మాత్రం పెరగడంలేదని వాపోయారు. దీనిపై స్పందిస్తూ.. వైసీపీ ప్రభుత్వం విధిస్తున్న పన్నుల వల్లే నిత్యావసరాల ధరలు పెరిగాయని లోకేశ్ వివరించారు. రాష్ట్రంలో సామాన్యులు బతికే పరిస్థితి లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై పన్నుల భారం తగ్గించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని మహిళలకు హామీ ఇచ్చారు.