GG Krishna Rao: టాలీవుడ్ సీనియర్ ఎడిటర్ కృష్ణారావు కన్నుమూత

Tollywood Senior Editor GG Krishna Rao passed away

  • బెంగళూరులో తుదిశ్వాస విడిచిన జీజీ కృష్ణారావు
  • వృద్ధాప్య సంబంధ సమస్యలతో మృతి
  • కె.విశ్వనాథ్ దర్శకత్వంలో అత్యధిక చిత్రాలకు ఎడిటింగ్ బాధ్యతలు
  • మూడు నంది అవార్డులు అందుకున్న కృష్ణారావు

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన మరో ప్రముఖుడు కన్నుమూశారు. సీనియర్ ఎడిటర్ జీజీ కృష్ణారావు నేడు బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సంబంధ సమస్యలతో ఆయన మృతి చెందారు. 

కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం, సప్తపది, సాగరసంగమం, స్వాతిముత్యం, శుభలేఖ, సూత్రధారులు, శృతిలయలు, సిరివెన్నెల, శుభసంకల్పం, స్వరాభిషేకం.... దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన బొబ్బిలిపులి, సర్దార్ పాపారాయుడు వంటి చిత్రాలకు కృష్ణారావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. 

కె.విశ్వనాథ్ అప్పట్లో తీసిన అన్ని చిత్రాలకు దాదాపుగా కృష్ణారావే ఎడిటర్ గా పనిచేశారు. వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఉండేది. కృష్ణారావు ఎడిటింగ్ నైపుణ్యానికి గుర్తింపుగా మూడు నంది అవార్డులు వరించాయి. సప్తపది, సాగరసంగమం, శుభసంకల్పం చిత్రాలకు గాను ఆయన బంగారు నందులు అందుకున్నారు. ఈ మూడు చిత్రాలు కె.విశ్వనాథ్ దర్శకత్వంలోనివే కావడం విశేషం.

బాపు శ్రీరామరాజ్యం, జంధ్యాల ముద్దమందారం, నాలుగు స్తంభాలాట చిత్రాలకు కూడా కృష్ణారావే ఎడిటర్. కృష్ణారావు తన కెరీర్ లో 200 చిత్రాలకు పైగా ఎడిటర్ గా వ్యవహరించారు. 

పాడవోయి భారతీయుడా చిత్రం తెలుగులో ఎడిటర్ గా ఆయనకు మొదటి చిత్రం. హిందీలోనూ ఆయన పలు సినిమాలకు ఎడిటర్ గా వ్యవహరించారు. ఆయనకు అప్పట్లో అగ్రశ్రేణి చిత్ర నిర్మాణ సంస్థలు పూర్ణోదయ, విజయ మాధవి ప్రొడక్షన్స్ తో సత్సంబంధాలు ఉండేవి.

  • Loading...

More Telugu News