padi koushik reddy: తప్పయిపోయింది క్షమించండి.. మహిళా కమిషన్ కు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి వివరణ
- గవర్నర్ కు లేఖ ద్వారా క్షమాపణ కోరతానని వెల్లడి
- మంగళవారం ఢిల్లీ వెళ్లి కమిషన్ ముందు హాజరైన ఎమ్మెల్సీ
- మరోమారు గవర్నర్ ను కించపరచబోనని వివరణ
తెలంగాణ గవర్నర్ తమిళిసై పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలకు చింతిస్తున్నానంటూ జాతీయ మహిళా కమిషన్‌ను క్షమాపణ కోరారు. గవర్నర్ తమిళిసై కి క్షమాపణలు కోరుతూ లేఖ రాస్తానని వివరించారు. ఈమేరకు ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ ముందు మంగళవారం కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. గవర్నర్‌పై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా జాతీయ మహిళా కమిషన్‌కు ఎమ్మెల్సీ క్షమాపణ చెప్పారు.
గవర్నర్ తమిళిసై పై ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ గా స్పందించింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి ఎమ్మెల్సీకి నోటీసులు జారీ చేసింది. తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని అందులో పేర్కొంది. ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీ వెళ్లిన కౌశిక్ రెడ్డి.. జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. మరోసారి గవర్నర్‌ను కించపరుస్తూ మాట్లాడబోనని, తిరిగి వెళ్లాక గవర్నర్ ను లిఖితపూర్వకంగా క్షమాపణలు కోరతానని చెప్పారు. ఆ లేఖను కమిషన్ కు కూడా పంపిస్తానని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చెప్పారు.