Andhra Pradesh: న్యాయవాదులకు భృతి విడుదల చేసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్
- ఒక్కో జూనియర్ లాయర్ కు ప్రతి నెలా రూ.5,000
- లాయర్ల కార్పస్ ఫండ్ కు మరో రూ.కోటి జమ
- పాదయాత్ర సమయంలో లాయర్ల కష్టాలను తెలుసుకున్నట్టు ప్రకటన
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వైఎస్సార్ లా నేస్తం పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి దీన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు,
2011 మంది జూనియర్ లాయర్లకు ప్రతి నెలా రూ.5,000 చొప్పున భృతి అందిస్తున్నట్లు చెప్పారు. లా డిగ్రీ పూర్తి చేసిన వారు, కొత్తగా న్యాయవాద వృత్తి ఆరంభించిన వారు, తమ వృత్తిలో నిలదొక్కుకునేందుకు వీలుగా వారికి మూడేళ్ల పాటు ప్రతి నెలా ఈ సాయాన్ని అందించనున్నట్టు తెలిపారు. తాజా సాయంతో గత మూడున్నరేళ్లలో మొత్తం రూ.35.40 కోట్లను 4,248 మంది న్యాయవాదులకు అందించినట్టు చెప్పారు.
పేదలకు న్యాయం అందాలన్నదే తమ ఆశయమని చెప్పారు. లాయర్ల కోసం 100 కోట్లతో కార్పస్ ఫండ్ ను ఏర్పాటు చేసినట్టు చెప్పిన ఆయన, దానికి మరో రూ.కోటి జమ చేస్తున్నట్టు తెలిపారు. పాదయాత్ర సమయంలో న్యాయవాదుల కష్టాలను తాను తెలుసుకున్నానని చెబుతూ, వారిని ఆదుకునేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.