used oil: వాడిన నూనెను మళ్లీ వాడడం ప్రాణాంతకమే!
- డీప్ ఫ్రై కోసం వాడిన నూనె తో తయారయ్యే వంటకాలు విషతుల్యం
- గుండె ఆరోగ్యానికి ముప్పు తప్పదని ఆరోగ్య నిపుణుల హెచ్చరిక
- కాలేయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్ ముప్పు కూడా ఉంటుందని వెల్లడి
పిండి వంటల కోసం ఒకసారి వాడిన నూనెను తిరిగి వంటకాల్లో ఉపయోగించడం ప్రాణాంతకంగా మారొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకసారి వాడిన నూనెతో తయారుచేసే వంటకాలు విషంతో సమానమని చెబుతున్నారు. పూరీలు, బజ్జీలు చేశాక మిగిలిపోయిన నూనెను కూరలకు వాడొద్దని సూచిస్తున్నారు. ఈమేరకు అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్, ఫిన్ లాండ్ కు చెందిన నెస్టే కంపెనీ మన దేశంలోని ముంబై, కోల్ కతా, ఢిల్లీ, చెన్నై నగరాల్లో జరిపిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది.
ఈ అధ్యయనంలో భాగంగా పలువురు మహిళలను ప్రశ్నించగా.. ఒకసారి వాడిన నూనెలో దాదాపు 60 శాతాన్ని మళ్లీ కూరల తయారీకోసం వాడుతున్నట్లు చెప్పారు. ఇలా వాడడం ఏమాత్రం మంచిదికాదని నిపుణులు చెబుతున్నారు. ఒకసారి ఉపయోగించిన నూనెలో పోషకాలన్నీ వాడుకున్నట్లేనని, దానిని మళ్లీ వేడి చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ గా మారుతుందని చెప్పారు.
ఈ చెడు కొలెస్ట్రాల్ గుండెకు హానికరమని వివరించారు. ఈ నూనెతో తయారుచేసే ఆహార పదార్థాలు తీసుకుంటే రక్తనాళాలు గట్టిపడటం, అల్జీమర్స్, కాలేయ సంబంధ వ్యాధులు, హైపర్టెన్షన్ తదితర అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని చెప్పారు. క్యాన్సర్ బారిన పడే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.