TDP: టీడీపీ నేత పట్టాభిని కోర్టులో హాజరు పరిచిన పోలీసులు
- వైద్యుల నివేదికను సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించిన అధికారులు
- గన్నవరం సబ్ జైలుకు తరలించాలని ఆదేశించిన అదనపు జూనియర్ సివిల్ జడ్జి
- మరో జైలుకు మార్చాలన్న పోలీసుల విజ్ఞప్తిని తోసిపుచ్చిన జడ్జి
తెలుగుదేశం నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ను గన్నవరం సబ్ జైలుకు తరలించాలంటూ అదనపు జూనియర్ సివిల్ జడ్జి పోలీసులను ఆదేశించారు. శాంతిభద్రతల దృష్ట్యా పట్టాభిని వేరే జైలుకు తరలించేందుకు అనుమతివ్వాలని కోరగా.. జడ్జి తిరస్కరించారు. ముందస్తు అనుమతి కోరితే పరిశీలిస్తామని న్యాయమూర్తి తెలిపారు. ఈమేరకు బుధవారం టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని పోలీసులు గన్నవరం అదనపు జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరిచారు. పట్టాభిని పరిశీలించి వైద్యులు ఇచ్చిన నివేదికను న్యాయమూర్తికి అందజేశారు. నివేదికను పరిశీలించిన తర్వాత పట్టాభిని గన్నవరం సబ్ జైలుకు తరలించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
పట్టాభితో పాటు 11 మంది టీడీపీ నేతలకు మంగళవారం గన్నవరం కోర్టు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. పోలీసులు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ పట్టాభి చెప్పడంతో వైద్య పరీక్షలు జరిపి, నివేదిక అందజేయాలంటూ పోలీసులను జడ్జి ఆదేశించారు. దీంతో పట్టాభి మినహా మిగతా నేతలను పోలీసులు మంగళవారమే గన్నవరం సబ్ జైలుకు తరలించారు. వైద్యపరీక్షల కోసం పట్టాభిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు పూర్తయ్యేసరికి అర్ధరాత్రి దాటడంతో పట్టాభిని పోలీసులు తమ కస్టడీలోనే ఉంచుకున్నారు. బుధవారం ఉదయం పట్టాభిని కోర్టు ముందు హాజరుపరిచారు.