Bank OF Baroda: నిరుద్యోగులకు బ్యాంక్ ఆఫ్ బరోడా గుడ్ న్యూస్.. 546 ఉద్యోగాలకు నోటిఫికేషన్
- అక్విజేషన్ మేనేజర్ పోస్టులు 500
- మార్చి 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
- విశాఖపట్టణం, హైదరాబాద్‌లలో పరీక్ష కేంద్రాాలు
- 100 మార్కులకు 90 నిమిషాల సమయం
ప్రభుత్వం రంగ బ్యాంక్.. బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మొత్తం 546 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీస్ విభాగంలో అక్విజేషన్ మేనేజర్ పోస్టులు 500, ప్రైవేటు బ్యాంకర్ 15, వెల్త్ స్ట్రాటజిస్ట్ 19 పోస్టులు సహా పలు ఖాళీలను భర్తీ చేయనుంది. మార్చి 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
వయో పరిమితి ఇలా..
అక్విజేషన్ ఆఫీసర్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయసు 21 ఏళ్లు కాగా, గరిష్ఠంగా 28 ఏళ్లు ఉండాలి. ఇతర పోస్టులకు 24 నుంచి 50 ఏళ్లలోపు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏడాదికి రూ. 5 లక్షల వేతనం
అభ్యర్థులు ఏదైనా యూనివర్సిటీ నుంచి కనీసం డిగ్రీ చదివి ఉండాలి. గతంలో ఏడాదిపాటు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు లేదంటే ఏవైనా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల్లో ఏడాదిపాటు పనిచేసిన అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. అక్విజేషన్ ఆఫీసర్లకు మెట్రో నగరాల్లో అయితే ఏడాదికి రూ. 5 లక్షలు, నాన్ మెట్రో నగరాల్లో అయితే రూ. 4 లక్షలు వేతనంగా ఇస్తారు. ఇతర అభ్యర్థులకు మాత్రం సంస్థ నియమనిబంధనలకు అనుగుణంగా వేతనాలుంటాయి.
వారికి రూ. 600.. వీరికి రూ. 100
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ. 100 దరఖాస్తు రుసుముగా నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్టణంలో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూట్, జనరల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. 100 ప్రశ్నలకు 90 నిమిషాల్లో సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.