Pre School: ఒకటో తరగతిలో చేరాలంటే కనీస వయసు ఆరేళ్లు ఉండాలి: రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
- జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా అడుగులు
- ఫౌండేషన్ దశలో తొలుత మూడేళ్లపాటు ప్రీ స్కూల్ విద్య
- అందుకు అనుగుణంగా నిబంధనలు సవరించాలన్న కేంద్రం
- ప్రీ స్కూల్ టీచర్ల కోసం రెండేళ్ల డిప్లొమా కోర్సులను రూపొందించాలని సూచన
ఒకటో తరగతిలో చేరే పిల్లల కనీస వయసును ఆరేళ్లుగా నిర్ణయించాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది. జాతీయ నూతన విద్యా విధానం ప్రకారం 3 నుంచి 8 సంవత్సరాల వయసులో పిల్లలకు ఫౌండేషన్ దశలో భాగంగా మూడేళ్లపాటు ప్రీ స్కూల్ విద్య, ఆ తర్వాత 1, 2 తరగతులు ఉంటాయి. ప్రీ స్కూల్ నుంచి పిల్లలకు ఎలాంటి అవాంతరాలు లేని అభ్యాస పద్ధతిని ప్రోత్సహించాలన్నదే ఈ విధానం ముఖ్య ఉద్దేశమని కేంద్రం పేర్కొంది.
ప్రీ స్కూళ్లలో మూడేళ్లపాటు నాణ్యమైన విద్య అందినప్పుడే అది సాధ్యమవుతుందని పేర్కొంది. ఈ లక్ష్యం నెరవేరేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆరేళ్లు నిండిన విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పించాలని కోరింది. ఇందుకు అనుగుణంగా ప్రవేశ ప్రక్రియలో నిబంధనలను సవరించాలని సూచించింది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో ప్రీ స్కూల్ విద్యార్థులకు తగిన విధంగా బోధించే టీచర్లను తయారుచేసేందుకు వీలుగా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా కోర్సులను రూపొందించి అమలు చేయాలని సూచించింది.