pregnancy: ప్రెగ్నెన్సీతో వచ్చే సమస్యలతో ప్రతీ 2 నిమిషాలకు ఒక మహిళ మృతి: ఐరాస
- తాజా నివేదికలో బయటపెట్టిన డబ్ల్యూహెచ్ వో
- ఏటేటా తగ్గుతున్నప్రసూతి మరణాల సంఖ్య
- క్రిటికల్ హెల్త్ సర్వీసుల కల్పనపై దృష్టి సారించాలి.. ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్ వో చీఫ్ విజ్ఞప్తి
గర్భందాల్చిన తర్వాత ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలు మహిళలకు ప్రాణాంతకంగా మారుతున్నాయని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. ఈ సమస్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతీ రెండు నిమిషాలకు ఒక గర్భిణి లేదా బాలింత చనిపోతోందని ఓ నివేదికలో వెల్లడించింది. ప్రపంచదేశాల్లో అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులోకి రావడంతో ప్రసూతి మరణాల సంఖ్య బాగా తగ్గిందని తెలిపింది. గర్భిణిలు, బాలింతల మరణాల సంఖ్య కూడా తగ్గినా.. ఇప్పటికీ చనిపోతున్న మహిళల సంఖ్య ఎక్కువగానే ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. గడిచిన 20 ఏళ్లలో ప్రసూతి మరణాలు 34.3 శాతం తగ్గిందని తెలిపింది. 2000 ఏడాదిలో ప్రతీ లక్ష డెలివరీలలో 339 మంది మహిళలు చనిపోగా, 2020 నాటికి ఇలా చనిపోతున్న మహిళల సంఖ్య 223కు తగ్గిందని పేర్కొంది. 2020 ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా రోజూ 800 మంది మహిళలు చనిపోయారని, అంటే ప్రతీ రెండు నిమిషాలకు ఒకరు చనిపోయారని తెలిపింది.
గర్భందాల్చడం, బిడ్డకు జన్మనివ్వడం చాలా మంది మహిళలకు ఇప్పటికీ ప్రమాదకరంగానే ఉండడంపై ఈ నివేదికలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. గర్భిణిలు, బాలింతలకు క్రిటికల్ హెల్త్ సర్వీసులు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదన్న చేదు నిజాన్ని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘేబ్రియేసస్ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల పునరుత్పాదక హక్కును కాపాడేందుకు అన్ని దేశాలు ప్రయత్నించాలని, మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.