USA: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో మరో భారతీయుడు
- రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ రేసులో దిగుతానని భారత అమెరికన్ రామస్వామి ప్రకటన
- అమెరికా ప్రయోజనాలకే తన తొలి ప్రాధాన్యమని వెల్లడి
- ఇప్పటికే ఎన్నికల బరిలో భారత మూలాలున్న రిపబ్లికన్ నేత నిక్కీ హేలీ
- పార్టీ తరఫున రెండో భారత సంతతి అభ్యర్ధిగా రామస్వామి
అమెరికా అధ్యక్ష రేసులో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మరో భారత సంతతి వ్యక్తి రెడీ అయ్యారు. ఇండియన్-అమెరికన్ పారిశ్రామికవేత్త, రిపబ్లికన్ పార్టీ నేత రామస్వామి పార్టీ ప్రైమరీ ఎన్నికల రేసులో పాల్గొంటానని తాజాగా ప్రకటించారు. పార్టీ తరఫున ఇప్పటికే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత మూలాలున్న మరో నేత నిక్కీ హేలీ బరిలో ఉన్నారు. వచ్చే ఏడాది జనవరిలో జరిగే రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో గెలిచిన వారికే ఆ తరువాత జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీకి దిగే అవకాశం దక్కుతుంది.
రామస్వామి(37) ఓహాయోలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులది కేరళ. రామస్వామి 2007లో హార్వర్డ్ కాలేజీలో జీవశాస్త్రంలో డిగ్రీ పట్టాపొందారు. అనంతరం యేల్ లా స్కూల్ నుంచి డాక్టర్ ఆఫ్ జురిస్ప్రుడెన్స్ పట్టా పొందారు. 2014లో బయోటెక్ సంస్థ రోయివంట్ సైన్సెస్ స్థాపించారు. 2015, 2016 సంవత్సరాల్లో అతిపెద్ద బయోటెక్ ఐపీవోలకు నేతృత్వం వహించారు. పలు టెక్నాలజీ సంస్థలనూ నెలకొల్పారు. రాజకీయాల్లో ప్రజాభిప్రాయానికి పెద్ద పీట వేసేందుకు గతేడాదే స్ట్రైవ్ అసెట్ మేనేజ్‌మెంట్ అనే కొత్త సంస్థను ఆయన స్థాపించారు. అమెరికా ప్రయోజనాలకే తన తొలి ప్రాధాన్యమంటూ రామస్వామి పేర్కొన్నారు.