Karnataka: రాష్ట్రంలో చాలామంది జీవితాలు ఆమె వల్లే నాశనమయ్యాయి.. ఐఏఎస్ రోహిణిపై ఐపీఎస్ రూప సంచలన ఆరోపణలు
- కర్ణాటకలో ఐఏఎస్ వర్సెస్ ఐపీఎస్ వివాదం
- రోహిణి అవినీతిపై దృష్టి పెట్టాలని మీడియాకు రూప విజ్ఞప్తి
- బదిలీ వేటు పడ్డా సరే మరోమారు ఆరోపణలు
- రూపకు పరువు నష్టం నోటీసులు పంపిన రోహిణి
కర్ణాటకలో ఐఏఎస్ వర్సెస్ ఐపీఎస్ వివాదం మరింత హీటెక్కింది. వ్యక్తిగత ఆరోపణలతో రచ్చకెక్కిన ఐఏఎస్ రోహిణి సింధూరి, ఐపీఎస్ రూపా మౌద్గిల్ లపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేసింది. అయినప్పటికీ ఐపీఎస్ ఆఫీసర్ తగ్గడంలేదు. తాజాగా గురువారం రోహిణిపై రూప మరోమారు సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో చాలామంది జీవితాలు నాశనం కావడానికి రోహిణి కారణమయ్యారని ఆరోపించారు.
అలాంటి మహిళను నిలదీయాల్సిందేనని మరోమారు నోరు పారేసుకున్నారు. ఇప్పటికే ఒక ఐఏఎస్, మరో ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నారని, మరో ఐపీఎస్ అధికారుల జంట విడాకులు తీసుకుందని రూప చెప్పారు. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకే ఈ పోరాటం చేస్తున్నానని సమర్థించుకున్నారు. రోహిణీ సింధూరి అవినీతిపై దృష్టి పెట్టాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు.
తన వివాహ జీవితంపై జరుగుతున్న ప్రచారాన్ని రూపా మౌద్గిల్ ఖండించారు. భర్తతో కలిసే ఉన్నానని, తమపై తప్పుడు ప్రచారం చేయొద్దని కోరారు. బాధితుల తరఫున తాను పోరాడుతున్నానని, తాను ధైర్యవంతురాలినని స్పష్టం చేశారు. రోహిణి, రూపల మధ్య వివాదం నేపథ్యంలో ఇద్దరిపైనా వేటు వేసిన చీఫ్ సెక్రటరీ.. సోషల్ మీడియాలో రచ్చ వద్దని, పోస్టులు పెట్టొద్దని హెచ్చరించారు. అయినప్పటికీ రూపా మౌద్గిల్ వినిపించుకోలేదు. రోహిణి సింధూరిపై సోషల్ మీడియా వేదికగా మళ్లీ ఆరోపణలు గుప్పించారు.
రూపకు లీగల్ నోటీసులు..
సోషల్ మీడియాలో రూపా మౌద్గిల్ పెట్టిన పోస్టులతో తన పరువుకు భంగం కలిగిందంటూ ఐఏఎస్ రోహిణి సింధూరీ కోర్టుకెక్కారు. రూపకు లీగల్ నోటీసులు జారీ చేశారు. తన పరువుకు భంగం కలిగించినందుకు, మానసికంగా వేధింపులకు గురిచేసినందుకు పరిహారంగా రూ.కోటి చెల్లించాలని, 24 గంటల్లో లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పాలని అందులో పేర్కొన్నారు.