T20 World Cup: టీ20 ప్రపంచ కప్ సెమీస్ కు ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ
- అనారోగ్యంతో హర్మన్ ప్రీత్, వస్త్రాకర్ దూరం
- నేడు ఆస్ట్రేలియాతో భారత్ సెమీస్ పోరు
- సాయంత్రం 6.30 గంటల నుంచి మ్యాచ్
మహిళల టీ20 ప్రపంచ కప్ లో ఎలాగైనా విజేతగా నిలవాలని ఆశిస్తున్న భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. అత్యంత బలమైన ఆస్ట్రేలియాతో ఈ రోజు రాత్రి సెమీఫైనల్లో పోటీ పడనున్న భారత్ ఇద్దరు కీలక క్రికెటర్ల సేవలు కోల్పోనుంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, ఆల్ రౌండర్ పూజా వస్త్రాకర్ ఈ మ్యాచ్ కు అందుబాటులో ఉండటం లేదని తెలుస్తోంది. ఇద్దరూ అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న పూజా వస్త్రాకర్ పూర్తిగా టోర్నీ నుంచి తప్పుకుంది. ఆమె స్థానంతో స్నేహ్ రాణాను జట్టులో చేర్చేందుకు అనుమతి ఇచ్చింది.
హర్మన్ ప్రీత్ అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఆమెతోపాటు స్పిన్నర్ రాధా యాదవ్ ఫిట్ నెస్ పైనా అనుమానాలు ఉన్నాయి. హర్మన్ మ్యాచ్ లో ఆడకపోతే వైస్ కెప్టెన్ స్మృతి మంధాన జట్టుకు నాయకత్వం వహించనుంది. హర్మన్ స్థానంతో తుది జట్టులోకి హర్లీన్ డియోల్ వచ్చే అవకాశం ఉంది. అత్యంత బలమైన ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్లో ఎంతో అనుభజ్ఞురాలైన హర్మన్ లేకుండా బరిలోకి దిగితే భారత్ జట్టుకు మరింత సవాల్ తప్పకపోవచ్చు. ఈ సెమీఫైనల్ సాయంత్రం 6.30 గంటలకు మొదలవనుంది.