Kanna Lakshminarayana: ఈ రెండు కారణాలతో నేను టీడీపీలో చేరాను: కన్నా
- టీడీపీ తీర్థం పుచ్చుకున్న కన్నా
- ఆత్మీయంగా అక్కున చేర్చుకున్న చంద్రబాబు
- తన ప్రసంగం ఆపి కన్నాకు మాట్లాడేందుకు అవకాశమిచ్చిన బాబు
- టీడీపీలో ఎందుకు చేరానన్న దానిపై కన్నా వివరణ
సీనియర్ రాజకీయవేత్త, ఏపీ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇవాళ జరిగిన ఓ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. తన వెంట భారీ సంఖ్యలో నేతలను, కార్యకర్తలను కూడా ఆయన టీడీపీలోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు.
"టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో ఇవాళ నేను టీడీపీలో చేరాను. నాతో పాటు పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు కూడా టీడీపీలో చేరారు. ఒకప్పుడు నేను కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిని. ఇవాళ నేను టీడీపీలో చేరడంపై సందేహాలు కలగొచ్చు.
ఎందుకు టీడీపీలోకి వచ్చానంటే... రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది. తండ్రిని మరిపించేలా పరిపాలిస్తానంటూ ఒక్క చాన్స్ అడిగి అధికారంలోకి వచ్చాడు. కానీ సంక్షేమం అంటూనే చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ ఎత్తుకెళుతున్న విధంగా పరిపాలన చేస్తున్నాడు. ఏదో తన సొంత సొమ్ము ఇస్తున్నట్టు, తన భారతి సిమెంట్ నుంచి డబ్బు తెచ్చి ఇస్తున్నట్టు, నేను డబ్బులు ఇస్తున్నాను అని చెప్పుకుంటున్నాడు.
9 లక్షల కోట్ల అప్పులు తెచ్చినా, ఆఖరికి చెత్త మీద కూడా పన్ను వేయాల్సి వచ్చింది. ఆర్టీసీ చార్జీలు పెంచేశారు, కరెంటు బిల్లులు పెరిగిపోయాయి. ప్రజల ఆస్తులు తాకట్టు పెడుతున్నారు, ప్రజల ఆస్తులు అమ్మేస్తున్నారు... ఈ డబ్బులన్నీ ఏంచేస్తున్నాడో జగన్ మోహన్ రెడ్డి చెప్పాలి.
ప్రధానంగా అమరావతి రాజధాని అంశం గురించి చెప్పాలి. విపక్షంలో ఉన్నప్పుడు జగన్ అమరావతి రాజధానినే కొనసాగిస్తానని చెప్పాడు. కానీ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అంటున్నాడు. ప్రధాని మోదీ అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రదేశంలో నేను ఒక రోజు దీక్ష కూడా చేశాను.
జగన్ ఆలోచన ఒక్కటే... మూడు రాజధానులు కాదు, మూడు ప్రాంతాల అభివృద్ధి కాదు... అమరావతి అయితే ఇదంతా భారీ ఎత్తున అభివృద్ధి చేయాల్సి ఉంటుందని, అదే విశాఖ అయితే ఇప్పటికే అభివృద్ధి చెంది ఉండడంతో, దోచుకోవడానికి రెడీగా ఉందన్న అభిప్రాయం తప్ప నాకు మరొకటి కనిపించడంలేదు.
నేను ఇప్పటిదాకా బీజేపీలో ఉన్నాను. ప్రపంచమంతా భారతదేశం వైపు చూసేలా ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలిస్తున్నారు. కానీ ఏపీలో జగన్ రాక్షసపాలన పోవాలి, అమరావతే రాజధాని కావాలన్న రెండు కారణాలతో నేను ఇవాళ టీడీపీలోకి వస్తున్నాను" అని కన్నా స్పష్టం చేశారు.