Team India: మహిళల టీ20 వరల్డ్ కప్... టీమిండియా లక్ష్యం 173 రన్స్
- మహిళల వరల్డ్ కప్ లో నేడు సెమీస్
- భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా
- మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్
- 20 ఓవర్లలో 4 వికెట్లకు 172 పరుగులు
మహిళల టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో టీమిండియా ముందు భారీ లక్ష్యం నిలిచింది. కేప్ టౌన్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 172 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఓపెనర్ బెత్ మూనీ 54, కెప్టెన్ మెగ్ లానింగ్ 49 (నాటౌట్), ఆష్లే గార్డనర్ 31, అలీసా హీలా 25 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో శిఖా పాండే 2, దీప్తి శర్మ 1, రాధా యాదవ్ 1 వికెట్ తీశారు.
ఇక, 173 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ కు ఆరంభంలోనే కష్టాలు ఎదురయ్యాయి. భారత్ 28 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధన 2, యువ బ్యాటర్ షెఫాలీ వర్మ 9 పరుగులకే వెనుదిరిగారు. వన్ డౌన్ లో వచ్చిన యస్తికా భాటియా 4 పరుగులు చేసి రనౌట్ అయింది. అయితే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్ జట్టును ఆదుకున్నారు.
ప్రస్తుతం భారత్ స్కోరు 10 ఓవర్లలో 3 వికెట్లకు 93 పరుగులు కాగా... హర్మన్ ప్రీత్ 33, జెమీమా రోడ్రిగ్స్ 39 పరుగులతో ఆడుతున్నారు. భారత్ విజయం సాధించాలంటే ఇంకా 60 బంతుల్లో 80 పరుగులు చేయాలి.