Congress: పేపర్ లీకేజీలపై గుజరాత్ ప్రభుత్వం ఉక్కుపాదం.. పదేళ్ల జైలు.. రూ. కోటి జరిమానా.. బిల్లుకి ఆమోదం!
- వరుస పేపర్ లీకేజీలతో విమర్శలు మూటగట్టుకున్న ప్రభుత్వం
- ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- సాయంత్రం బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం
- ఆలస్యమైనా మంచి పనిచేశారంటూనే విమర్శలు గుప్పించిన కాంగ్రెస్
వరుస పేపర్ లీకేజీలతో విమర్శలు మూటగట్టుకుంటున్న గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లీకేజీలకు పాల్పడే వారిపై ఎవరూ ఊహించని కఠిన చర్యలు తీసుకునే దిశగా ముందడుగు వేసింది. ఇందులో భాగంగా ఇలాంటి కేసులను ఎదుర్కొనేందుకు అసెంబ్లీలో నిన్న ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చే బిల్లును ప్రవేశపెట్టింది. ఈ కేసుల్లో దోషిగా తేలిన వారికి పదేళ్ల వరకు జైలు, కోటి రూపాయల వరకు జరిమానా విధించాలని బిల్లులో ప్రతిపాదించారు.
బడ్జెట్ సెషన్ మొదటి రోజు చర్చ కోసం ఈ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బిల్లును స్వాగతించిన ప్రతిపక్ష కాంగ్రెస్.. అలస్యమైనా మంచి పని చేశారని ప్రశంసించింది. అయితే, రిక్రూట్మెంట్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల నుంచి ఫీజు వసూలు చేయొద్దని డిమాండ్ చేసింది. పేపర్ లీకేజీల కారణంగా యువత భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని, వారి ప్రయోజనాలను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శలు గుప్పించింది.
కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసనల మధ్య హోంమంత్రి హర్ష సంగ్వి ప్రవేశపెట్టిన బిల్లుకు సాయంత్రం పొద్దుపోయాక అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. అభ్యర్థి, పరీక్ష నిర్వహించే సిబ్బంది సహా ఎవరైనా సరే అక్రమాలకు పాల్పడితే పదేళ్ల జైలు శిక్ష, కోటి రూపాయల జరిమానా విధిస్తారు. గతంలో ఇది ఐదేళ్లు, పది లక్షల రూపాయలుగా ఉండేది.