elon: ఇచ్చిన మాట తప్పిన మస్క్? ట్విట్టర్లో మరోమారు తొలగింపుల పర్వం
- ట్విట్టర్‌ను మెరుగుపరచాలంటూ ఉద్యొగులకు మస్క్ డెడ్‌లైన్
- ఆ తరువాత సేల్స్, ఇంజినీరింగ్ శాఖల్లో ఉద్యోగులకు ఉద్వాసన
- మస్క్ ఇచ్చినమాట తప్పారా? అన్న అంతర్జాతీయ మీడియా
ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ మాట తప్పారా? ఇకపై ఉద్యోగుల తొలగింపులు ఉండవంటూనే మళ్లీ సిబ్బందిని తీసేస్తున్నారా? ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలో ఇవే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ట్విట్టర్‌ను మస్క్ చేజిక్కించుకున్నాక తొలిసారిగా చేపట్టిన తొలగింపుల్లో ఏకంగా 50 శాతం మంది ఉద్యోగులు ఉద్వాసనకు గురైన విషయం తెలిసిందే. ఆ తరువాత సంస్థలో ఎవరినీ తీసేయబోమని మస్క్ ఉద్యోగులకు మాటిచ్చినట్టు అంతర్జాతీయ మీడియాలో ఓ కథనం ప్రచురితమైంది. అయితే.. ఇలా ఉద్యోగులకు హామీ ఇచ్చిన తరువాతి కాలంలో మస్క్ ఏకంగా రెండు సార్లు ఉద్యోగులను తొలగించారట.
తాజాగా మరికొందరు ట్విట్టర్ ఉద్యోగుల్ని తొలగించినట్టు వర్జ్ అనే వార్త పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఈసారి సేల్స్, ఇంజినీరింగ్ శాఖల్లోని ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారట. అంతకుమునుపు.. ట్విట్టర్ అడ్వర్టైజ్మెంట్ విధానాన్ని మెరుగుపరచాలంటూ మస్క్ ఉద్యోగులకు వారం రోజుల గడువిచ్చారట. ఈ క్రమంలోనే కొందరు ఉద్యోగాలు కోల్పోయినట్టు సమాచారం. అయితే.. డెడ్‌లైన్‌లోపు లక్ష్యాన్ని చేరుకోలేని వారినే తొలగించారా? లేదా? అన్నదానిపై మాత్రం స్పష్టత లేదు.