KTR: లైఫ్ సెన్సెస్ రంగంలో ప్రపంచ హబ్ గా హైదరాబాద్: మంత్రి కేటీఆర్
- ప్రపంచంలోని టాప్-10 ఫార్మా కంపెనీల్లో నాలుగు తెలంగాణలో ఉన్నాయన్న మంత్రి
- హైదరాబాద్ లో బయో ఏషియా-2023 సదస్సును ప్రారంభించిన కేటీఆర్
- హెచ్ ఐసీసీ లో మూడు రోజులపాటు జరుగనున్న సదస్సు
లైఫ్ సైన్సెస్, ఫార్మారంగం, మంచి పర్యావరణ వ్యవస్థకు తెలంగాణ నిలయంగా ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచంలోని టాప్-10 ఫార్మా కంపెనీల్లో నాలుగు తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహించడం రాష్ట్రానికి గర్వ కారణమని చెప్పారు. లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రపంచ హబ్‌గా హైదరాబాద్ అవతరించిందని తెలిపారు. రాష్ట్రంలో 800కు పైగా ఫార్మా, బయోటెక్ కంపెనీలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో మూడు రోజులపాటు జరుగనున్న బయో ఏషియా-2023సదస్సును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ప్రగతిశీల విధానాల వల్ల తెలంగాణకు ప్రగతిశీల రాష్ట్రంగా గుర్తింపు దక్కిందన్నారు. ప్రపంచంలోనే మూడింట ఒకవంతు వ్యాక్సిన్ల ఉత్పత్తి తెలంగాణలో జరుగుతున్నదని వెల్లడించారు. హైదరాబాద్‌లో బయో ఏషియా సదస్సు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.
హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రపంచంలోనే అతి పెద్ద హబ్ గా నిర్మితమవుతుందన్నారు. గత 7 సంవత్సరాల్లో 3 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు వచ్చాయన్నారు. లైఫ్ సైన్సెస్ రంగం బలోపేతానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అనేక చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. వివిధ ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్‌ల ద్వారా హైదరాబాద్‌ను ప్రపంచంలోనే హెల్త్ టెక్ మక్కాగా నిలబెట్టేందుకు రాష్ట్రం కృషి చేస్తుందని కేటీఆర్ తెలిపారు.