Prime Minister: ఈశాన్యాన్ని ఏటీఎంలా వాడుకుంది..: కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన ప్రధాని

Congress remote controlled Nagaland from Delhi used Northeast as ATM says PM Modi

  • అభివృద్ధికి సంబంధించి నిధులను కాజేశారంటూ ఆరోపణలు
  • ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ తో నాగాలాండ్ ను నడిపించారని వ్యాఖ్య
  • శాంతి, అభివృద్ధి, శ్రేయస్సు బీజేపీ మంత్రాలుగా పేర్కొన్న ప్రధాని

నాగాలాండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఢిల్లీ నుంచి నాగాలాండ్ ను రిమోట్ కంట్రోల్ తో నడిపించిందన్నారు. ఈశాన్య రాష్ట్రాలను ఏటీఎంలా వాడుకుందని విమర్శించారు. ఈ నెల 27న నాగాలాండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం చుమోకెదిమా జిల్లాలో ప్రధాని మోదీ బహిరంగ సభలో మాట్లాడారు. 

కాంగ్రెస్ పార్టీ హయాంలో నాగాలాండ్ రాష్ట్రంలో రాజకీయ అస్థిరత ఉండేదన్నారు. ఢిల్లీ నుంచి దిమాపూర్ వరకు వారసత్వ రాజకీయాలు నిర్వహిస్తూ, అభివృద్ధికి ఉద్దేశించిన నిధులను కాజేశారని ప్రధాని ఆరోపించారు. ప్రశాంతత, అభివృద్ధి, శ్రేయస్సు అనేవి నాగాలాండ్ కు సంబంధించి బీజేపీ పాటించే మంత్రాలుగా ప్రధాని పేర్కొన్నారు. అందుకే బీజేపీ పట్ల నాగాలాండ్ ప్రజల్లో నమ్మకం పెరిగినట్టు చెప్పారు. నాగాలాండ్ లో శాశ్వత శాంతి స్థాపనకు ఎన్డీయే సర్కారు కృషి చేస్తోందని చెబుతూ.. అందులో భాగంగా రాష్ట్రంలో సాయుధ దళాల చట్టం (ప్రత్యేక అధికారాలు) 1958ని పూర్తిగా ఎత్తేసినట్టు ప్రకటించారు.

‘‘టెక్నాలజీ సాయంతో బీజేపీ ఈశాన్య ప్రాంతంలో అవినీతిని కట్టడి చేసింది. కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ప్రజలు నేరుగా తమ బ్యాంకు ఖాతాలకు నిధులు పొందుతున్నారు’’ అని ప్రధాని తెలిపారు. ఈ బహిరంగ సభను బీజేపీ, దాని భాగస్వామ్య పార్టీ ఎన్డీపీపీ సంయుక్తంగా నిర్వహించాయి.

  • Loading...

More Telugu News