Zelensky: పోరాడుతున్నాం.. ప్రతిఘటిస్తున్నాం.. అజేయంగా ఉన్నాం: జెలెన్ స్కీ

Ukraines Zelensky Says 2023 Year Of Victory

  • ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య మొదలై ఏడాదైన సందర్భంగా జెలెన్ స్కీ సందేశం
  • తెల్ల జెండాని కాదు.. నీలం, పసుపు రంగు జెండాని ఎంపిక చేసుకున్నామని వ్యాఖ్య 
  • 2023 తమకు విజయ సంవత్సరమని వెల్లడి

ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య మొదలై ఈ రోజుతో ఏడాది పూర్తయింది. రెండు వైపులా లక్ష మందికి పైగా చనిపోయారు. ఊర్లకు ఊర్లు నేలమట్టమై ఉక్రెయిన్ శిథిలమైంది. ఆర్థిక ఆంక్షలతో రష్యా అతలాకుతలమైంది. ఇంకా యుద్ధం ముగియలేదు. రెండు దేశాలు వెనక్కి తగ్గలేదు.

ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుదు వొలోదిమిర్ జెలెన్ స్కీ.. తన దేశ ప్రజలకు సందేశమిచ్చారు. 2023 తమకు విజయ సంవత్సరం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ వీడియోను ట్వీట్ చేశారు.

‘‘ఫిబ్రవరి 24న మనలోని లక్షలాది మంది.. ఒక దారిని ఎంచుకున్నారు. తెల్ల జెండాని కాదు.. నీలం, పసుపు రంగు జెండాని ఎంపిక చేసుకున్నాం. పారిపోలేదు.. ఎదుర్కొంటున్నాం, ప్రతిఘటిస్తున్నాం, పోరాడుతున్నాం. ఇది బాధ, దుఃఖం, విశ్వాసం, ఐక్యతా సంవత్సరం. మనం అజేయంగా ఉన్న సంవత్సరం. 2023 మన విజయ సంవత్సరమని మనకు తెలుసు’’ అని ఆయన పేర్కొన్నారు.

మరో వీడియోను షేర్ చేసిన జెలెన్ స్కీ.. ఏడాది కిందట ఉక్రెయిన్ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘సంవత్సరం క్రితం ఇదే రోజున, ఇదే స్థలం నుంచి ఉదయం ఏడు గంటలకు ప్రసంగించాను. అది కూడా కేవలం 67 సెకన్లు మాత్రమే’’ అని అన్నారు.

  • Loading...

More Telugu News