Russia: ఉక్రెయిన్ తో యుద్ధం ఆగాలని హరిద్వార్ లో రష్యన్ల పూజలు
- ప్రపంచ శాంతి కోసం గంగానది ఒడ్డున ప్రార్థనలు
- రష్యా నుంచి ఇటీవల భారత్ వచ్చిన 24 మంది రష్యన్లు
- హరిద్వార్, రిషికేశ్ లలో హిందూ దేవుళ్లకు పూజలు
ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం మొదలై ఏడాది దాటింది.. అయినా, ఇప్పట్లో యుద్ధం ముగిసిపోయే సూచనలు కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో రష్యా నుంచి మన దేశానికి వచ్చిన బృందం ఒకటి హరిద్వార్ లో పూజలు చేసింది. ఈ బృందంలోని 24 మంది రష్యన్లు గంగానదిలో పవిత్ర స్నానం చేసి, ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగిపోవాలని పూజలు చేశారు. ఈమేరకు కంఖాల్ లోని రాజ్ ఘాట్ లో హిందూ ఆచారాల ప్రకారం గంగను పూజించారు. ప్రపంచ శాంతి కోసం ప్రార్థించారు.
రెండు దేశాల్లో శాంతి నెలకొల్పేందుకు ఆయా దేశాల పౌరులు చేస్తున్న ప్రయత్నాలకు ఈ బృందం ప్రయత్నం అద్దం పడుతోంది. ఈ పూజల కోసం రష్యా నుంచి ప్రత్యేకంగా వచ్చామని, హిందూ ఆచారాలపై నమ్మకంతో పాటిస్తున్నామని వారు తెలిపారు. అందుకే హరిద్వార్ లో పూజలు చేశామని రష్యన్ల బృందం నాయకుడు తెలిపారు. గతేడాది ఫిబ్రవరి 24న రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైంది. ఏడాది పూర్తయినా ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకోవడానికి రష్యా ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది.
ఏడాదిలో ఎంతో మంది పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్ లో ఆస్తినష్టం పెద్దయెత్తున జరిగింది. పలు దేశాల ఆర్థిక పరిస్థితిపైనా యుద్ధ ప్రభావం పడింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ప్రధానంగా గోధుమలు, సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలు పెరిగాయి. యుద్ధం కారణంగా 70 వేల కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం జరిగిందని నిపుణులు అంచనా వేశారు.