vizag: విశాఖలోని జాలరిపేటలో శ్వేతనాగు.. వీడియో ఇదిగో !
- చేపలు పట్టే వలలో చిక్కుకున్న అరుదైన పాము
- వలలో నుంచి తీసి కాపాడిన స్నేక్ క్యాచర్స్
- జూ అధికారులకు అప్పగించనున్నట్లు వెల్లడి
విశాఖపట్నంలోని జాలరిపేటలో అరుదైన శ్వేతనాగు కనిపించింది. చేపలు పట్టే వలలో చిక్కిన శ్వేతనాగును చూసి పేటలోని జనం భయాందోళనలకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించగా.. వారు అక్కడికి చేరుకుని పామును కాపాడారు. జాలరిపేటలో కనిపించిన ఈ శ్వేతనాగు అరుదైన పాము అని స్నేక్ క్యాచర్ కిరణ్ చెప్పారు. ఈ పాము బుస, పడగలతో పాటు విషం కూడా మామూలు పాముల కంటే భిన్నమని వివరించారు. శ్వేతనాగు కాటేస్తే మనిషి క్షణాల్లోనే విగతజీవిగా మారిపోతారని తెలిపారు. సాధారణంగా శ్వేతనాగు మనుషుల కంటపడదని, అరుదుగా ఎక్కడో ఓ చోట కనిపిస్తుందని చెప్పారు.
జాలరి పేట కోటవీధి సమీపంలోని మేరీ మాత ఆలయం కొండ ప్రాంతం నుంచి ఈ శ్వేతనాగు జనావాసాల్లోకి వచ్చింది. ఓ ఇంటి బయట ఉన్న చేపలు పట్టే వలలో ఇరుక్కుపోయి శ్వేతనాగు విలవిలలాడింది. పామును గమనించిన జనం వెంటనే సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్నట్లు కిరణ్ చెప్పారు. వలలో నుంచి బయటపడేందుకు చేసిన ప్రయత్నంతో పాముకు గాయాలయ్యాయని తెలిపారు.
దీంతో పామును క్షేమంగా బయటకు తీసి, ప్రథమ చికిత్స చేసినట్లు వివరించారు. సాధారణంగా పాములను పట్టినప్పుడు వాటిని జాగ్రత్తగా తీసుకెళ్లి మనుషులు తిరగని ప్రాంతంలో వదిలిపెడుతుంటానని కిరణ్ పేర్కొన్నారు. అయితే, ఇది అరుదైన పాము కావడంతో జూలాజికల్ డిపార్ట్ మెంట్ అధికారులను సంప్రదించాకే ఈ శ్వేతనాగును ఏంచేయాలనేది నిర్ణయిస్తామని తెలిపారు.